సికింద్రాబాద్ కాల్పుల ఘ‌ట‌న‌పై పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే..!

  • ప్ర‌ధాన నిందితుడిగా మ‌ధుసూద‌న్ గుర్తింపు
  • మొత్తం 56 మంది అల్ల‌ర్ల‌లో పాల్గొన్నట్టు నిర్ధార‌ణ‌
  • అల్ల‌ర్ల కోసం 89 వాట్సాప్ గ్రూప్‌ల‌ను క్రియేట్ చేసిన వైనం
  • 2 రైలింజ‌న్ల‌కు నిప్పు పెట్టేందుకు నిందితుల ప్లాన్‌
  • ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసుల వెల్ల‌డి
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగిన ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల కాల్పులు, కాల్పుల్లో రాకేశ్ అనే యువ‌కుడి మృతి... త‌దిత‌ర ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ను సిద్ధం చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో ప‌లు కీల‌క అంశాల‌ను పోలీసులు ప్ర‌స్తావించారు.

సికింద్రాబాద్ అల్ల‌ర్లలో మొత్తం 56 మంది పాల్గొన్న‌ట్లు పోలీసులు తేల్చారు. వీరిలో ప్ర‌ధాన నిందితుడు (ఏ1)గా మ‌ధుసూద‌న్ అనే వ్య‌క్తిని గుర్తించారు. ఇప్ప‌టికే అత‌డితో పాటు ఏ12 నుంచి ఏ56 దాకా ఉన్న నిందితుల‌ను అరెస్ట్ చేయ‌గా... ఏ2 నుంచి ఏ11 వ‌ర‌కు ఉన్న నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు పేర్కొన్నారు. అల్ల‌ర్ల‌కు ముందు 8 వాట్సాప్ గ్రూప్‌ల‌ను క్రియేట్ చేసిన నిందితులు ప‌క్కా వ్యూహం ప్ర‌కార‌మే అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ్డార‌ని తేల్చారు.

నిందితుల‌కు ప‌లు డిఫెన్స్ అకాడెమీలు స‌హ‌క‌రించాయ‌ని కూడా పోలీసులు నిర్ధారించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు 8.30 గంట‌ల‌కు చేరుకోవాల‌ని వాట్సాప్ గ్రూప్‌లో స‌మాచారాన్ని చేర‌వేసుకున్న నిందితులు 8.50 గంట‌ల‌కు రైల్వే స్టేష‌న్ కు చేరుకున్నార‌ని పోలీసులు తేల్చారు.

నిర‌స‌న‌ల్లో భాగంగా 2 రైలింజ‌న్ల‌కు నిప్పు పెట్టాల‌ని నిందితులు భావించార‌ని, అందుకోసం పెట్రోల్ కూడా తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు తేల్చారు. ఇదిలా ఉంటే... నిర‌స‌న‌కారుల‌ను అదుపు చేసే క్ర‌మంలో హెచ్చ‌రిక‌లు జారీ చేశామ‌ని, అయితే నిర‌స‌న‌కారులు త‌మ‌పై రాళ్ల దాడి చేయ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో భాగంగానే కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒక‌రు మ‌ర‌ణించ‌గా. 12 మంది గాయ‌ప‌డ్డ‌ట్లు తెలిపారు.


More Telugu News