నన్ను ఆపేదెవరు.. ఎవరికీ లొంగను: జగ్గారెడ్డి

  •  తానేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ కోసమేనన్న జగ్గారెడ్డి 
  • ప్రచార మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపణ 
  • తాను ఎవరి ఒత్తిడికీ లొంగలేదు.. భవిష్యత్తులో లొంగేది లేదని వ్యాఖ్య 
  • త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్న టీ కాంగ్రెస్ నేత
తనపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని.. పార్టీ నుంచి వెళ్లిపోతానని జరుగుతున్న ప్రచారాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఖండించారు. తాను ఏం చేసినా, ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ నుంచి వెళ్లాలని అనుకుంటే తనను ఆపగలిగేది ఎవరని వ్యాఖ్యానించారు. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ లైన్ లోనే పనిచేస్తానని పేర్కొన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ పై వ్యాఖ్యలతో..
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆయనను కలవడం, దానిని తప్పుపడుతూ టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతూ.. బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవచ్చన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.

కొన్ని ప్రసార మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని జగ్గారెడ్డి చెప్పారు. తాను అనుకున్నదే మాట్లాడుతానని, ఎవరికీ భయపడబోనని తెలిపారు. ఎవరి ఒత్తిళ్లకూ లొంగబోననని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించారు.



More Telugu News