దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి.. ఏక్ నాథ్ షిండే వర్గానికి ఉద్ధవ్ థాకరే సవాల్

  • శివసేనను అంతం చేసేందుకు బీజేపీ కుట్ర అన్న ఉద్ధవ్ 
  • ఎవరేమిటో ప్రజలే తీర్పు చెబుతారని కామెంట్ 
  • శివసేన జిల్లా అధ్యక్షులు, ఇతర నేతల సమావేశంలో ఉద్ధవ్ ప్రసంగం
ఏక్ నాథ్ షిండే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు రావాలని, ఎవరేమిటో ప్రజలే తీర్పు చెబుతారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సవాల్ చేశారు. అంతే తప్ప ఇలాంటి ఆటలు ఆడటం ఏమిటని నిలదీశారు. ఇదంతా శివసేన పార్టీ అనేదే లేకుండా చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపించారు. సోమవారం శివసేన బీజేపీ జిల్లా అధ్యక్షులతో ఉద్ధవ్ సమావేశమయ్యారు. పోరాటం చేసేందుకు అంతా కలిసికట్టుగా నిలవాలని కోరారు. అనంతరం ఈ భేటీ వివరాలతో పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. 

ప్రజా కోర్టులో తేల్చుకుందాం..
‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర ఇది. వాళ్లకు నేను సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రాజీనామా చేసి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు రావాలి. ఈ ఆటలు ఆడే బదులు.. ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం. ఒకవేళ మేం తప్పు చేసి ఉంటే ప్రజలే మమ్మల్ని ఇంటికి సాగనంపుతారు. ఒకవేళ మీరు (బీజేపీ, ఏక్ నాథ్ షిండే గ్రూప్) తప్పు అయితే ప్రజలు మిమ్మల్ని ఇంటికి సాగనంపుతారు.” అని ఉద్ధవ్ థాకరే సవాల్ చేశారు.



More Telugu News