నవ్వుతూ ఉంటారా.. లేక ఆరునెలల జీతం జరిమానాగా కడతారా?: ఫిలిప్పీన్స్ మేయర్ హెచ్చరిక

  • ప్రజలతో ప్రశాంతంగా వ్యవహరించాలని, నవ్వుతూ సమాధానమివ్వాలని నిబంధనలు
  • ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయడం లేదా ఆరు నెలల జీతం జరిమానాగా కట్టడం శిక్షలుగా ఖరారు.
  • ఇటీవలే ఫిలిప్పీన్స్ లోని ములానే నగరంలో అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించిన మేయర్
ఏదో ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళతారు. చాలాసేపు ఎదురుచూడాలి. తన వంతు వచ్చాక అధికారి వద్దకు వెళ్లినా కసురుకుంటుంటారు. ఏదైనా అడిగితే చికాగ్గా సమాధానం చెబుతుంటారు. కొన్నిసార్లు అయితే ఆగ్రహంతో బెదిరిస్తుంటారు కూడా. ఫిలిప్పీన్స్ లో కూడా ఇలాంటి పరిస్థితే కనబడటంతో.. అక్కడి ములానే నగర పాలకవర్గం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రభుత్వ అధికారులు ప్రజలతో ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వ్యవహరించాలని.. నవ్వుతూ సమాధానం చెప్పాలని నగర మేయర్ అరిస్టాటిల్ అగ్విరే ఆదేశించారు.

కొత్తగా వస్తూనే ‘స్మైల్ పాలసీ’ 
అరిస్టాటిల్ అగ్విరే ఇటీవలే ములానే నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. నగరంలో ప్రభుత్వ పాలన పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతూ ‘స్మైల్ పాలసీ’ని అమల్లోకి తీసుకువచ్చారు. అధికారుల తీరుపై స్థానిక మత్స్యకారులు, కొబ్బరి పెంపకం దారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారని.. పన్నులు కట్టడానికి వచ్చినవారితోనూ చికాకుతో వ్యవహరించారని చెప్పారని మేయర్ చెప్పారు. ఈ క్రమంలోనే సరికొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.

ఆరు నెలల జీతం జరిమానాగా కట్టాల్సిందే..
ప్రజలతో నవ్వుతూ వ్యవహరించని అధికారులు, సిబ్బంది ఆరు నెలల వేతనాన్ని జరిమానాగా కట్టాల్సి ఉంటుందని మేయర్ హెచ్చరించారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. మున్సిపాలిటీకి వివిధ పనుల కోసం చాలా దూరం నుంచి ప్రజలు వస్తుంటారని.. వారి పట్ల దయగా, మర్యాదగా వ్యవహరించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.




More Telugu News