సగం తిన్న శాండ్ విచ్ తెచ్చుకుందని రూ.1.43 లక్షల ఫైన్ వేశారు!

  • యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన మోడల్ జెస్సికా లీ
  • మధ్యలో సింగపూర్ లో పెద్ద శాండ్ విచ్ కొనుక్కున్న మోడల్
  • సగం తిని మిగతాది విమానంలో తిందామనుకుని మర్చిపోయిన తీరు
  • ఆమె సామగ్రిలో శాండ్ విచ్ పేరు లేదంటూ జరిమానా వేసిన కస్టమ్స్ అధికారులు
సాధారణంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏదైనా కొనుక్కుని తింటూ ఉంటాం. ఎక్కడైనా, ఎవరికైనా ఇది మామూలే. కానీ ఆస్ట్రేలియాకు చెందిన మోడల్ జెస్సికా లీకి మాత్రం ఇదో పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది. ఒక్క శాండ్ విచ్.. అదీ సగం తిన్న శాండ్ విచ్ ఆమెకు రూ.1.43 లక్షల జరిమానా వేయించింది.

ఆకలైతే శాండ్ విచ్ కొనుక్కుని..
   జెస్సికా లీ ఇటీవలే యూరప్ దేశాలకు వెళ్లి తిరిగి వస్తోంది. దూరం చాలా ఎక్కువ కావడంతో సింగపూర్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంది. ముందు యూరప్ నుంచి సింగపూర్ కు వచ్చింది. అక్కడ కొన్ని గంటలు ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆకలేస్తే ఓ పెద్ద శాండ్ విచ్ కొనుక్కుంది. సగం తినేసి మిగతా సగాన్ని విమానంలో తిందాం లే అని బ్యాగ్ లో పెట్టుకుంది. కానీ విమానంలో ఆ మిగతా శాండ్ విచ్ ను తినేయడం మర్చిపోయింది.

అయితే ఆమె ఆస్ట్రేలియా ఎయిర్ పోర్టులో దిగాక.. కస్టమ్స్ సిబ్బంది సామగ్రి చెక్ చేశారు. తాను తెచ్చుకుంటున్న సామగ్రి వివరాల్లో శాండ్ విచ్ ను పేర్కొనలేదని.. అందులోని చికెన్, లెట్యూస్ (ఒకరకం ఆకుకూర) అలా తేవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ 2,664 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా వేశారు. ఇది మన కరెన్సీలో సుమారు రూ.1.43 లక్షలు కావడం గమనార్హం.

ఫైన్ ఎందుకిలా?
సాధారణంగా దేశాల మధ్య ఆహారం, మాంసం, వివిధ జంతువులు, మొక్కలు, చెట్లకు సంబంధించిన రవాణాపై ఆంక్షలు, నిబంధనలు ఉంటాయి. ఏవైనా సూక్ష్మజీవులు వంటివి వ్యాపించకుండా ఉండటం, ఆహార నియమాలు, ఆయా దేశాలకు అవి ప్రమాదకరం అయి ఉండటం, పేటెంట్లు, ఇతర నిబంధనలే దీనికి కారణం. ఈ క్రమంలోనే వీటిని తీసుకెళ్లేందుకు కస్టమ్స్  నిబంధనలు అంగీకరించవు. ఒకవేళ ఒప్పుకొన్నా.. వాటికి సంబంధించిన వివరాలను విమానం ఎక్కే ముందుగానే కస్టమ్స్ పత్రాల్లో పేర్కొనాల్సి ఉంటుంది. లేకపోతే జరిమానాలు, జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది.

ఇటీవలే జాబ్ వదిలేశా.. ఎలా..?
జెస్సికాకు ఫైన్ వేసిన కస్టమ్స్ అధికారులు అది చెల్లించడానికి 28 రోజులు గడువు ఇచ్చారు. అయితే తాను ఇటీవలే ఉద్యోగం వదిలేశానని, ఇంత భారీ ఫైన్ కట్టాల్సి వస్తోందని వాపోతూ జెస్సికా లీ ఓ వీడియో విడుదల చేసింది. ‘నేను చేసిన పొరపాటుతో భారీ జరిమానా కట్టాల్సి వస్తోంది. ఇంకెవరూ ఇలా చేయకండి’ అని పేర్కొంది.



More Telugu News