జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా.. 90 శాతం రోడ్లపై గుంతలు కనిపిస్తున్నాయి: విజయశాంతి
- గ్రేటర్ పరిధిలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయన్న విజయశాంతి
- 20 వేలకు పైగా పాట్ హోల్స్ ఉన్నాయని వెల్లడి
- వర్షాలు ఆగిపోయినా జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం లేదని విమర్శ
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. రోడ్లపై గుంతలు పడి ఎక్కడికక్కడ కంకర తేలిందని చెప్పారు. గుంతల్లో నీళ్లు నిలుస్తున్నాయని అన్నారు. జీహెచ్ఎంసీ పరధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా... 90 శాతం రోడ్లపై గుంతలు పడ్డాయని చెప్పారు. 709 కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగిలిన అన్ని రోడ్లు ఇలానే ఉన్నాయని అన్నారు. రోడ్లపై 20 వేలకు పైగా పాట్ హోల్స్ ఉన్నాయని చెప్పారు.
వానలు తగ్గుముఖం పట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ... క్షేత్రస్థాయిలో ఆ మేరకు జరగడం లేదని విజయశాంతి అన్నారు. రోడ్లు వేయండని ప్రజల నుంచి కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా వినతి పత్రాలను ఇస్తున్నారని... దీంతో, కొన్ని చోట్ల నామమాత్రంగా పాట్ హోల్స్ ను పూడ్చి, చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. గుంతల్లో కంకర, డాంబర్ పోసి వదిలేస్తున్నారని... దీంతో, కొన్ని గంటల్లోనే అక్కడ మళ్లీ గుంతలు పడుతున్నాయని చెప్పారు. వానలు ఆగి మూడు రోజులు గడుస్తున్నా జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం లేదని అన్నారు.