చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో పడ‌వ ప్ర‌మాదం... గోదావ‌రిలో ప‌డిపోయిన దేవినేని ఉమ, ఇత‌ర నేత‌లు

  • ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సోంప‌ల్లిలో ఘ‌ట‌న‌
  • న‌దిలో ప‌డిపోయిన న‌లుగురు కీల‌క నేత‌లు
  • వెనువెంట‌నే స్పందించిన మ‌త్స్య‌కారులు
  • టీడీపీ నేత‌ల‌ను సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చిన వైనం
వ‌ర‌ద ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కొన‌సాగిస్తున్న పర్య‌ట‌న‌లో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా సోంప‌ల్లి వ‌ద్ద చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో టీడీపీ సీనియ‌ర్ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఉండి ఎమ్మెల్యే రామ‌రాజు, త‌ణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ‌తో పాటు పార్టీకి చెందిన మ‌రో నేత స‌త్య‌నారాయ‌ణ గోదావ‌రి న‌దిలో ప‌డిపోయారు. అయితే చంద్రబాబు ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. దీంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
ఈ ప్ర‌మాదంపై త‌క్ష‌ణ‌మే స్పందించిన మ‌త్స్య‌కారులు టీడీపీ నేత‌ల‌ను న‌దిలో నుంచి సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోంప‌ల్లి చేరుకున్న సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న రెండు ప‌డ‌వ‌లు ప‌ర‌స్ప‌రం ఢీకొన్నాయి. దీంతో ఓ వైపున‌కు ఒరిగిపోయిన ప‌డ‌వ‌లో ఉన్న టీడీపీ నేత‌లు గోదావ‌రిలో ప‌డిపోయారు. అయితే మ‌త్స్య‌కారులు వేగంగా స్పందించ‌డంతో ఎవ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. న‌దిలో ప‌డిన టీడీపీ నేత‌ల‌ను మ‌త్స్య‌కారులు బ‌య‌ట‌కు తీసుకువ‌స్తున్న దృశ్యాలు మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


More Telugu News