మన దర్శకులు కూడా ఇలా చేస్తే ఫలితాలు మరోస్థాయిలో ఉంటాయి: చిరంజీవి

  • 'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్
  • తెలుగు దర్శకుల పనితీరుపై స్పందన
  • సెట్స్ మీదకు వచ్చాక డైలాగ్ నేర్పడం సరికాదని హితవు
  • వర్క్ షాపు సంస్కృతి అలవర్చుకోవాలని సూచన
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'లాల్ సింగ్ చడ్డా' చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో హీరో ఆమిర్ ఖాన్, నటుడు నాగచైతన్యలతో కలిసి చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తెలుగు దర్శకుల పనితీరుపై సున్నితమైన రీతిలో విమర్శనాత్మకంగా స్పందించారు. 

ఓ సినిమా స్క్రిప్టును ఆ సినిమాలోని అందరు నటీనటులకు, టెక్నీషియన్లకు తెలియపర్చడం వల్ల వచ్చే ఫలితాలు మరోస్థాయిలో ఉంటాయని అన్నారు. స్క్రిప్టుపై పూర్తి అవగాహన ఉండడం వల్ల నటీనటులు, నిపుణులు పూర్తిస్థాయిలో తమ పనిపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుందని, ఇది కచ్చితంగా సినిమాపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. కానీ ఇక్కడ అలా జరగడంలేదని అన్నారు.

"ఇప్పుడేమవుతోందంటే... మెయిన్ హీరోకు మాత్రం కొంతవరకు స్క్రిప్టు గురించి తెలుసుంటుంది. ఆ సినిమాలోని  ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకు గానీ, కమెడియన్స్ కు గానీ స్క్రిప్టు తెలియదు. వాళ్లు సెట్స్ మీదకు వచ్చి అప్పటికప్పుడు దర్శకుడు ఏంచెబుతాడో అదే చేస్తారు. దాంతో నటీనటుల ఇన్వాల్వ్ మెంట్ అంతవరకే ఉంటుంది. కానీ, ఇది సరికాదు. 

ఓ సినిమాకు సంబంధించి స్క్రిప్టును దర్శకుడు ముందే ఖరారు చేసుకోవాలి. డైలాగులను నటీనటులతో సాధన చేయించేందుకు వర్క్ షాపులు నిర్వహించాలి. ఓ గదిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అందరూ కూర్చుని సీన్ల గురించి చర్చించాలి. అక్కడ్నించి సెట్స్ మీదకు వెళ్లిన నటుడు తన డైలాగ్ ఏంటన్నదానిపై మనసు పెట్టక్కర్లేదు... పెర్ఫార్మెన్స్ పై మనసు పెడితే చాలు. డైలాగ్ ఏంటన్నది వారు అప్పటికే నేర్చుకుని ఉంటారు కాబట్టి నటనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించగలరు. తద్వారా వారు తమ అత్యుత్తమ నటన కనబర్చగలరు. 

ఆమిర్ ఖాన్ వంటి వాళ్లు ఇలాంటి పద్ధతినే ఫాలో అవుతున్నారు. దీన్ని మనవాళ్లు కూడా అనుసరించాలి. మన చిత్రపరిశ్రమకు తగిన రీతిలో ఆ విధానాలను స్వీకరించి అమలు చేయగలగాలి. మన దర్శకులు కూడా అలాంటి వర్క్ షాపులను నిర్వహించే పద్ధతిని అందిపుచ్చుకోవాలి" అని చిరంజీవి సూచించారు.


More Telugu News