టీఆర్ఎస్‌కు రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహ‌న్ రెడ్డి రాజీనామా

  • బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌పై మోహ‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు
  • నాలుగు మండ‌లాల్లోని వంద‌ల మంది రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • అంద‌రితో క‌లిసి త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌తాన‌ని వెల్ల‌డి
  • ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకే టీఆర్ఎస్‌ను వీడుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి రైల్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహ‌న్ రెడ్డి రాజీనామా చేశారు. త‌న‌తో పాటుగా ఆయ‌న పలువురు స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీల‌తో పార్టీకి రాజీనామా చేయించారు. బోధ‌న్ నియోజకవ‌ర్గ ప‌రిధిలోని బోధ‌న్‌, న‌వీపేట‌, రెంజ‌ల్‌, యెడ‌ప‌ల్లె మండ‌లాల్లోని వంద‌ల మంది కార్య‌క‌ర్త‌లు త్వ‌ర‌లోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తార‌ని ఆయన చెప్పారు. వీరంద‌రితో క‌లిసి త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. 

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్‌పైనా, ఆ పార్టీకి చెందిన బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌పైనా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ శాఖ‌లో నాయ‌క‌త్వ లేమి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. బోధ‌న్ ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన మార్పును కోరుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చేందుకు ఎమ్మెల్యే ష‌కీల్‌కు స‌మ‌యం లేద‌ని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ష‌కీల్‌లో మార్పు వ‌స్తుంద‌ని రెండేళ్లుగా ఎదురు చూశామ‌న్న ఆయ‌న‌... ఆ దిశ‌గా ఎమ్మెల్యేలో మార్పే క‌నిపించ‌లేద‌న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకే తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.


More Telugu News