మునుగోడులో ధ‌ర్మం గెలుస్తుంది... కేసీఆర్ ప‌త‌నం ఇక్క‌డి నుంచే మొద‌లైంది: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

  • త‌న‌ను కొనే శ‌క్తి ఈ ప్రపంచంలో ఏ ఒక్క‌రికీ లేద‌న్న రాజ‌గోపాల్ రెడ్డి
  • త‌న రాజీనామాతో గ‌ట్టుప్ప‌ల్ మండ‌లంలో పింఛ‌న్లు వ‌చ్చాయ‌న్న నేత‌
  • మునుగోడు ప్ర‌జ‌లు చారిత్ర‌క తీర్పు ఇవ్వాల‌ని పిలుపు
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆదివారం సాయంత్రం బీజేపీలో అధికారికంగా చేరిపోయారు. మునుగోడులో బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో కోమ‌టిరెడ్డి బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కోమ‌టిరెడ్డి... కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా యుద్ధం చేస్తున్నాన‌న్న రాజ‌గోపాల్ రెడ్డి... అరాచ‌క పాల‌న‌ను అంత‌మొందించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. త‌న‌ను అమ్ముడుబోయిన నేత‌గా చెబుతున్నార‌న్న ఆయ‌న‌... త‌న‌ను కొనే శ‌క్తి ఈ ప్రపంచంలో ఏ ఒక్క‌రికీ లేద‌ని తెలిపారు. మునుగోడులో ధ‌ర్మం గెలుస్తుంద‌న్న రాజ‌గోపాల్ రెడ్డి... కేసీఆర్ ప‌త‌నం ఇక్క‌డి నుంచే మొద‌లైందని ప్ర‌క‌టించారు.

మునుగోడు ప్ర‌జ‌లు త‌ల‌దించుకునే ప‌ని ఎప్పుడు చేయ‌లేద‌ని కోమ‌టిరెడ్డి చెప్పారు. రాజీనామా చేసిన త‌ర్వాతే నిజాయ‌తీగా ప్ర‌జ‌ల తీర్పు కోరుతున్నాన‌ని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లపై అసెంబ్లీ వేదిక‌గా పోరాటం చేసినా ఫ‌లితం ద‌క్క‌లేద‌న్నారు. ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా సీఎం కేసీఆర్ ఇవ్వ‌లేద‌న్నారు. తాను రాజీనామా చేస్తే ఫాం హౌజ్‌లో ప‌డుకున్న కేసీఆర్ నిద్ర లేచి మునుగోడు వ‌స్తార‌ని తాను ముందే చెప్పాన‌న్నారు. తాను చెప్పిన‌ట్లుగానే శనివారం కేసీఆర్ మునుగోడు వ‌చ్చార‌న్నారు. త‌న రాజీనామాతో గ‌ట్టుప్ప‌ల్ మండ‌లంతో పాటు కొత్త పింఛ‌న్లు వ‌చ్చాయ‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఆక‌లినైనా చంపుకొంటారు గానీ... ఆత్మ‌గౌర‌వాన్ని వ‌దులుకోర‌ని కోమ‌టిరెడ్డి చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్య‌క్తి కోస‌మో, ఒక పార్టీ కోస‌మే వ‌చ్చింది కాద‌ని రాజ‌గోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ భ‌విష్య‌త్తు కోసం, రాష్ట్ర ఆత్మ గౌర‌వం కోసం వ‌చ్చిన ఎన్నిక ఇద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ధ‌ర్మ‌యుద్ధ‌మ‌ని తెలిపారు. తెలంగాణ భ‌విష్య‌త్తు నిర్మాణం జ‌ర‌గాలంటే మునుగోడు ప్ర‌జ‌లు చారిత్ర‌క తీర్పు ఇవ్వాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా క‌క్కిస్తామ‌ని కోమ‌టిరెడ్డి తెలిపారు.


More Telugu News