కుప్పంలో వైసీపీ ఫ్లెక్సీల‌ను చించేసిన టీడీపీ శ్రేణులు... వీడియో ఇదిగో

  • కుప్పంలో 3 రోజుల పర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్రబాబు
  • గురువారం కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్న వైనం
  • వైసీపీ ఫ్లెక్సీల‌ను చించివేస్తూ సాగిన టీడీపీ శ్రేణులు
  • చోద్యం చూస్తున్న పోలీసులూ వీడియోలో క‌నిపించిన వైనం
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న సందర్భంగా బుధ‌వారం నుంచి అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. త‌న సొంత నియోజ‌కవ‌ర్గంలో 3 రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు... బుధ‌వారం రామ‌కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టించారు. ఇక రెండో రోజైన గురువారం ఆయ‌న కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం, ప‌ర‌స్పరం భౌతిక దాడులు జ‌రిగాయి. ఈ దాడుల్లో ప‌లువురు గాయ‌పడ్డారు.

తాజాగా కుప్పంలో వైసీపీ కీల‌క నేత‌ల‌తో కూడిన ఫ్లెక్సీల‌ను చించివేస్తున్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. 21 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప‌సుపు కండువాలు త‌ల‌కు చుట్టుకున్న ప‌లువురు యువ‌కులు వైసీపీ జెండాలు, ఫ్లెక్సీల‌ను చించివేస్తూ క‌నిపించారు. ఈ ఘ‌ట‌న త‌మ క‌ళ్ల ఎదురుగా జ‌రుగుతున్నా... పోలీసులు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన వైనం కూడా వీడియోలో చాలా స్ప‌ష్టంగానే క‌నిపించింది.


More Telugu News