ఇటీవలే ప్రారంభం... అప్పుడే హ్యాకర్ల బారినపడిన ఆకాశ ఎయిర్

  • ఆగస్టు 7న ప్రారంభమైన ఆకాశ ఎయిర్
  • ఆగస్టు 25న హ్యాకింగ్ జరిగినట్టు గుర్తింపు
  • వినియోగదారులను అప్రమత్తం చేసిన ఆకాశ ఎయిర్
  • కీలక సమాచారం భద్రంగానే ఉందన్న వియానయాన సంస్థ
భారత్ లో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ లైన్స్ సంస్థ ఆకాశ ఎయిర్ హ్యాకర్ల దాడికి గురైంది. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న లాంఛనంగా ప్రారంభమైంది. కాగా, ఈ సంస్థ వినియోగదారులకు చెందిన డేటాపై హ్యాకర్లు పంజా విసిరారు. దీనిపై ఆకాశ ఎయిర్ స్పందించింది. హ్యాకర్లు కేవలం పేర్లు, జెండర్ వివరాలు, ఈమెయిల్ చిరునామాలు, ఫోన్ నెంబర్ల తస్కరణ వరకే పరిమితం అయ్యారని వివరించింది. ఈ కొద్ది సమాచారంతోనే హ్యాకర్లు ఫిషింగ్ తరహా మోసపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

ఈ హ్యాకింగ్ పై ఆకాశ ఎయిర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)కి ఫిర్యాదు చేసింది. ఆగస్టు 25న తమ కంప్యూటర్ వ్యవస్థల్లో టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఎర్రర్ వచ్చిందని, కొంతమంది వినియోగదారుల వివరాలను గుర్తుతెలియని వ్యక్తులు అనధికారికంగా పరిశీలించారని ఆకాశ ఎయిర్ వెల్లడించింది. 

ప్రయాణ సంబంధ వివరాలు కానీ, ట్రావెల్ రికార్డులు కానీ, చెల్లింపుల సమాచారం కానీ హ్యాకర్ల బారినపడలేదని స్పష్టం చేసింది. ఈ హ్యాకింగ్ ప్రయత్నాన్ని గుర్తించిన తర్వాత అనేక చర్యలు తీసుకున్నామని తెలిపింది. వినియోగదారులకు వెంటనే సమాచారం అందించడంతో పాటు, తమ కంప్యూటర్ వ్యవస్థలను నిలిపివేశామని వెల్లడించింది.


More Telugu News