మునుగోడులో పోటీపై 13న తేల్చనున్న టీడీపీ

  • తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం
  • మునుగోడులో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరిన నేతలు
  • స్థానిక నేతల అభిప్రాయం కూడా తీసుకోవాలని సూచించిన చంద్రబాబు
  • ఇకపై తరచూ టీడీపీ కార్యాలయానికి వస్తానని భరోసా
మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలవాలా? వద్దా? అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఈ నెల 13న తేల్చనుంది. చంద్రబాబునాయుడు నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బీసీలకు టీడీపీ తొలి నుంచి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మునుగోడులో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలు చంద్రబాబును కోరారు. స్పందించిన చంద్రబాబు ఈ విషయమై స్థానిక నేతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని సూచించినట్టు ఆ పార్టీ పొలిట్ సభ్యుడు అరవింద్ గౌడ్ తెలిపారు. 

చంద్రబాబుతో సమావేశమైన వారిలో మునుగోడు నేతలు కూడా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే విషయమై చంద్రబాబుతో చర్చించారు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర చేసి పదేళ్లు అయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలపై చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇక నుంచి తాను తరచుగా ఎన్టీఆర్ భవన్‌కు వస్తానని నాయకులకు హామీ ఇచ్చారు. సంస్థాగతంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి కార్యాచరణపై చర్చిద్దామని అన్నారు. అలాగే, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు చంద్రబాబు సూచించారు.


More Telugu News