విద్యార్థుల కోసం బ‌స్సు న‌డపాల‌న్న ప‌వ‌న్‌... ఆల్రెడీ న‌డుస్తోందంటూ రిప్లై ఇచ్చిన సజ్జనార్

  • రంగారెడ్డి జిల్లా ప‌ల్లెచెల్క‌, స‌రికొండ విద్యార్థుల‌కు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌న్న ప‌వ‌న్‌
  • ర‌వాణా సౌక‌ర్యం లేని కార‌ణంగా విద్యార్థులు చ‌దువుకు దూరం కాకూడ‌దని వ్యాఖ్య‌
  • ప‌వ‌న్ చెప్పిన రూట్లో ఇప్ప‌టికే స‌ర్వీసును న‌డుపుతున్నామ‌న్న సజ్జనార్
  • ద‌స‌రా సెల‌వుల్లో మాత్ర‌మే తాత్కాలికంగా ర‌ద్దు చేశామ‌ని వెల్ల‌డి
విద్యార్థుల కోసం ప్ర‌త్యేక బ‌స్సు న‌డ‌పాలంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ ప్ర‌భుత్వానికి బుధ‌వారం ఉద‌యం చేసిన విజ్ఞ‌ప్తికి నిమిషాల వ్య‌వ‌ధిలోనే స్పంద‌న వ‌చ్చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చూసినంత‌నే నిమిషాల వ్య‌వ‌ధిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ సజ్జనార్ స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించిన రూట్‌లో విద్యార్థుల కోసం ఆల్రెడీ ఓ బ‌స్సు స‌ర్వీసును న‌డుపుతున్నామ‌ని ఆయన వివ‌ర‌ణ ఇచ్చారు. 

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని ప‌ల్లెచెల్క తండా, స‌రికొండ గ్రామాల విద్యార్థులు చ‌దువుకోవ‌డానికి ఇబ్ర‌హీంప‌ట్నం, మేడిప‌ల్లి వెళ్లాల్సి వ‌స్తోంద‌న్న ప‌వ‌న్‌... బ‌స్సు సౌక‌ర్యం లేక ఆ గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ప్ర‌త్యేకించి బాలిక‌లు అట‌వీ మార్గం మీదుగా పాఠ‌శాల‌ల‌కు వెళ్లి రావ‌డం క‌ష్టంగా ఉంద‌ని తెలిపారు. కేవ‌లం ర‌వాణా సౌక‌ర్యం లేని కార‌ణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా విద్య‌కు దూరం కాకూడ‌ద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. త‌క్ష‌ణ‌మే తెలంగాణ ప్ర‌భుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ఈ గ్రామాల విద్యార్థుల‌కు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరారు.

సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న చూసిన వెంట‌నే టీఎస్ఆర్టీసీ ఎండీ స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించిన రూట్‌లో స్కూలు పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక స‌ర్వీసును న‌డుపుతున్నామ‌ని సజ్జనార్ వివ‌రించారు. ద‌స‌రా సెల‌వుల నేప‌థ్యంలో స‌ర్వీసును తాత్కాలికంగా నిలిపివేశామ‌ని, సెల‌వులు ముగిశాక తిరిగి ఈ స‌ర్వీసును పున‌రుద్ధ‌రించామ‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం ట్రాఫిక్ కార‌ణంగా ఈ స‌ర్వీసు గంట‌న్న‌ర ఆల‌స్యంగా న‌డిచింద‌ని సజ్జనార్ వివ‌రించారు.


More Telugu News