పవన్ ఉత్తరాంధ్ర ద్రోహి... గోబ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టిన ఉత్తరాంధ్ర జేఏసీ

  • మరికాసేపట్లో జనవాణిని ప్రారంభించనున్న పవన్
  • విశాఖ పోర్టు పరిధిలోని కళావాణి ఆడిటోరియంలో కార్యక్రమం
  • అప్పటికే ప్లకార్డులతో నిరసనకు దిగిన ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓ వైపు అధికార వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన... మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలతో విశాఖ నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శనివారం విశాఖ గర్జనకు హాజరై వెళుతున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్ లతో పాటు వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డిల కార్లపై జన సైనికులు దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. తాజాగా పవన్ కల్యాణ్ పర్యటనకు నిరసన తెలిపేందుకు ఉత్తరాంధ్ర జేఏసీ రంగంలోకి దిగింది. మరికాసేపట్లో విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లే పవన్ కల్యాణ్ కు నిరసన తెలపాలని జేఏసీ నిర్ణయించింది.

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఆదివారం ఉదయమే జేఏసీ నేతలు బరిలోకి దిగారు. పవన్ బస చేసిన నోవాటెల్ నుంచి కళావాణి ఆడిటోరియానికి దారి తీసే మార్గంలో ఈ ప్లకార్డులు పట్టుకుని జేఏసీ నేతలు నిరసనకు దిగారు. అంతేకాకుండా గో బ్యాక్ పవన్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను కూడా జేఏసీ నేతలు ప్రదర్శించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని నిరసనకు దిగిన జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. 


More Telugu News