లంబసింగి, చింతపల్లిలో పర్యాటకుల సందడి

  • వారాంతం, దీపావళి సెలవులతో ఎక్కువ మంది పర్యాటకుల రాక
  • రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
  • రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని అంచనాలు
సహజ అందాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు  జిల్లా లంబసింగి, చింతపల్లి, మారేడుమిల్లి పర్యాటక శోభను సంతరించుకున్నాయి. వారాంతపు సెలవులు, సోమవారం దీపావళి సెలవు నేపథ్యంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతాలకు విచ్చేశారు.   

ముఖ్యంగా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఇక్కడ 16 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం ఉదయం 14.8 డిగ్రీలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రకటించింది. వచ్చే కొన్ని రోజుల్లో ఇంకా తగ్గొచ్చని పేర్కొంది. చింతపల్లి, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి. దీంతో ఏటా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు, మంచు అధికంగా కురుస్తుంటుంది. దక్షిణ కశ్మీర్ గా లంబసింగికి పేరు. ఈ వాతావరణం, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.


More Telugu News