కేసీఆర్... నాపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి
  • రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసమేనన్న టీఆర్ఎస్
  • 36 ఏళ్లుగా తాము వ్యాపారాలు చేస్తున్నామన్న కోమటిరెడ్డి
  • కంపెనీ వ్యవహారాలు కొడుకు చూసుకుంటున్నాడని వెల్లడి
తాను రూ.18 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టు పనుల కోసమే బీజేపీలో చేరానంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. "కేసీఆర్... నాపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించు" అంటూ సవాల్ విసిరారు. 

తన కుటుంబం 36 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు తన కుమారుడు కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్నాడని వివరించారు. కోల్ ఇండియా సంస్థలో తమ కంపెనీకి ఓ గ్లోబల్ కాంపిటీటివ్ టెండరు దక్కితే, దాన్ని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 

ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను తప్పు చేశాననేందుకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్ నామినేషన్ పద్ధతిలో ఎన్నో కాంట్రాక్టులను ధారదత్తం చేయడంలేదా? అని నిలదీశారు. 

కాగా, మునుగోడు నియోజకవర్గం సహజంగానే కాంగ్రెస్ కు అడ్డా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎంతగానో అభిమానిస్తారని, ఇప్పుడు తాను బీజేపీలో చేరడంతో తనను నమ్మే వాళ్లందరూ కూడా బీజేపీ మద్దతుదారులుగా మారిపోతారని వివరించారు.


More Telugu News