భావితరాలకు ఆదర్శనీయ కూతురు.. రోహిణి ఆచార్యకు బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంస

  • నలభై ఏళ్ల వయసులో కిడ్నీ ఇవ్వడం రిస్కీ నిర్ణయమేనన్న బీజేపీ లీడర్
  • కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందన్న మీసా భారతి
  • లాలూ, రోహిణి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్
లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్యను ప్రశంసిస్తూ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సోమవారం ట్వీట్ చేశారు. ప్రతీ తండ్రి నీలాంటి కూతురు ఉండాలని కోరుకుంటాడని రోహిణిని ప్రశంసించారు. రోహిణి ప్రతి తండ్రికీ గర్వకారణమని చెప్పారు. భావితరాలకు ఆదర్శనీయ కూతురుగా నిలిచావని గిరిరాజ్ సింగ్ రోహిణిపై ప్రశంసల జల్లు కురిపించారు. 

నలభై ఏళ్ల వయసులో కిడ్నీ దాతగా మారడం కాస్త ప్రమాదకర నిర్ణయమేనని గిరిరాజ్ సింగ్ అన్నారు. కానీ తండ్రి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం గొప్ప విషయమని చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్(74)కు ఆయన చిన్న కూతురు రోహిణి ఆచార్య(40) కిడ్నీ ఇవ్వడం తెలిసిందే. 

సోమవారం సింగపూర్ లో జరిగిన ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్స విజయవంతమైందని లాలూ పెద్ద కూతురు మీసా భారతి ట్వీట్ చేశారు. లాలూ, రోహిణి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, వారిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను ఆమె ట్వీట్ చేశారు.


More Telugu News