మాజీ మంత్రి నారాయణకు ఊరట.. బెయిలు రద్దు ఉత్తర్వుల కొట్టివేత

  • బెయిలు రద్దు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో నారాయణ పిటిషన్
  • గతంలోనే ముగిసిన వాదనలు
  • చిత్తూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు
  • సెషన్స్ కోర్టు తీర్పును తప్పుబట్టిన న్యాయస్థానం
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి పి.నారాయణకు ఊరట లభించింది. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రిమాండ్‌ను నిరాకరిస్తూ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతు నారాయణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ముగియడంతో ఇటీవల తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం నిన్న తన తీర్పు వెల్లడించింది. 

నారాయణ బెయిలును రద్దు చేస్తూ  చిత్తూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టు అవకాశం ఇవ్వలేదని సెషన్స్ కోర్టు పేర్కొనడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు నిందితుడు హాజరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిదేనన్న న్యాయస్థానం.. నిందితుడిగా ఉన్న పిటిషనర్‌ను మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టింది పోలీసులేనన్న విషయాన్ని సెషన్స్ కోర్టు  గుర్తించకపోవడాన్ని ఆక్షేపించింది. 

మిగతా విషయాలను పక్కనపెట్టిన కోర్టు ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఇవ్వలేదన్న కారణంతో మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీంతో ఆ తీర్పును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, మేజిస్ట్రేట్ కోర్టు పిటిషనర్‌ను రిమాండ్‌కు ఇచ్చేందుకు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌కు మాత్రం విచారణార్హత ఉందని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో రిజివిజన్ పిటిషన్‌పై తేల్చాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది. అప్పటి వరకు పిటిషనర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.


More Telugu News