గడువులోగా పోలవరం పూర్తికావడం కష్టం: కేంద్రం

  • పార్లమెంటులో పోలవరం ప్రస్తావన
  • 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందన్న కేంద్రం
  • వివిధ కారణాలతో ఆలస్యమైందని వెల్లడి
  • లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు అంశంపై స్పందించింది. గడువులోగా పోలవరం పూర్తికావడం కష్టమని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని తెలిపింది. వివిధ కారణాలతో నిర్ణీత సమయానికి పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదని వివరించింది. వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

అటు, పోలవరంపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్ర్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు. పోలవరానికి 2019 నుంచి రూ.6,461 కోట్లు విడుదల చేశామని బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. 2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ ఖర్చు రూ.29,027 కోట్లు అని వెల్లడించారు. 2017-18 అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.47,725 కోట్లకు పెరిగిందని వివరించారు. 

ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులు పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. రూ.15,667 కోట్లకు గాను రూ.13,226 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం కాంపోనెంట్ నిధుల రూపంలో ఇంకా రూ.2,441 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.


More Telugu News