ఏపీలో నా వారాహిని ఆపండి... నేనేంటో చూపిస్తా!: సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్

  • సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
  • హాజరైన పవన్ కల్యాణ్
  • వచ్చే ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని వెల్లడి
  • వ్యూహం సంగతి తనకు వదిలేయాలని స్పష్టీకరణ
  • వారాహిలో ఏపీ రోడ్లపై తిరుగుతానంటూ సవాల్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధూళిపాళ్లలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. 

పోరాటం చేయనిదే మార్పు రాదని, ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికార పీఠంలో కూర్చోవాలని ఉవ్విళ్లూరు ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. కేసులు పెడతారని భయపడొద్దని, ధైర్యంగా నిలబడాలని ఉద్బోధించారు. 

"నేను చెబుతున్నాను కదా... నా మీద లాఠీ పడితే రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను. జైల్లో కూర్చోవడానికి కూడా వెనుకాడను. నా సినిమాలు ఆపేస్తావా... ఆపేసుకో. నన్ను ఏమీ చేయలేవు. నువ్వు కొట్టే కొద్దీ పైకి లేస్తాను తప్ప కిందపడేదిలేదు" అని స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయి, నిన్న చూశారు కదా ఎలా పార్టీ కార్యాలయాలు తగలబెట్టేశారో అని పవన్ వ్యాఖ్యానించారు. అధికారం పోతుంది కదా అని వైసీపీ వాళ్లు వచ్చే ఎన్నికల్లో గొడవలకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయం తనకు వదిలిపెట్టేయాలని తెలిపారు. జనసేనను అధికారంలోకి తెచ్చే బాధ్యతను మాకు వదిలేయండి... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో వెళ్లాలో నేను చూసుకుంటాను... నన్ను నమ్మండి అని జనసైనికులకు స్పష్టం చేశారు. 

వైసీపీ నేతలు తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని, వారానికి ఒకరోజు వస్తేనే తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన వద్ద తాతలు సంపాదించిన డబ్బు లేదని, అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు లేదని తెలిపారు. తనకు వేల కోట్లు, వందల కోట్లు ఇచ్చిన నాయకులు ఎవరూ లేరని, చిన్నవాళ్లు, కొత్తవాళ్లు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే తన వద్ద ఉందని పవన్ కల్యాణ్ వివరించారు. అందుకే వ్యూహం సంగతి తనకు వదిలేయాలని, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తేలేదని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 

అంతేకాదు, వారాహి వాహనం అంశాన్ని కూడా పవన్ ప్రసంగం చివర్లో ప్రస్తావించారు. "నేను నా వారాహి వాహనంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను... ఈ కూసే గాడిదలను రమ్మను.... నా వారాహిని ఆపండి... నేనేంటో అప్పుడు చూపిస్తా" అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు.


More Telugu News