ఈ నలుగురు హీరోలకు గట్టి హిట్టు అవసరమే!
- వరుస ఫ్లాపులతో నితిన్ ఉక్కిరిబిక్కిరి
- నాగశౌర్య పరిస్థితి కూడా అంతే
- రామ్ ఆశలన్నీ బోయపాటి సినిమాపైనే
- వచ్చే ఏడాదిపైనే శర్వానంద్ దృష్టి
టాలీవుడ్ లో హీరోల్లో కొంతమంది ఈ ఏడాది ఒక హిట్ కొడితే, మరికొంతమందికి ఫ్లాపులు కంటిన్యూ అయ్యాయి. అలాంటి హీరోల్లో ఒకరుగా నితిన్ కనిపిస్తాడు. క్రితం ఏడాది మూడు ఫ్లాపులను అందుకున్న నితిన్, 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ఈ ఏడాది మరో ఫ్లాప్ అందుకున్నాడు. అందువలన ఈ ఏడాది కూడా ఆయనకి నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవాలి. ఇక నాగశౌర్య పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది. కొన్నేళ్లుగా నాగశౌర్యకి హిట్ అనేది పడలేదు. ఈ ఏడాది చేసిన సినిమా కూడా ఆయనకి ఊరటను ఇవ్వలేకపోయింది. యాక్షన్ సినిమాల సంగతి అటుంచితే, ఫ్యామిలీ డ్రామాలు కూడా కలిసి రాకపోవడంతో, వచ్చే ఏడాది తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఈ ఏడాదిలో చేసిన ఒక్క సినిమా (ది వారియర్) పోవడంతో, బోయపాటి సినిమాపైనే రామ్ ఆశలు పెట్టుకున్నాడు. ఇక కొన్నేళ్ల నుంచి శర్వానంద్ వరుస ఫ్లాపులతో సతమతమవుతూ వస్తున్నాడు. ఈ ఏడాదిలో ఆయన నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' .. 'ఒకే ఒక జీవితం' వచ్చాయి. మొదటి సినిమాకి థియేటర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 'ఒకే ఒక జీవితం' మాత్రం ఫరవాలేదు అనిపించుకుంది. కాకపోతే అది శర్వానంద్ కి సరిపోయేంత హిట్ కాదు. అందువలన ఆయన దృష్టి అంతా కూడా నెక్స్ట్ ఇయర్ పైనే ఉంది. ఈ ముగ్గురు హీరోలకి కొత్త సంవత్సరంలోనైనా హిట్ పడుతుందేమో చూడాలి.