రాష్ట్రంలో వ్యవస్థలు నాశనం అయ్యాయి: చంద్రబాబు

  • విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • రాజాంలో భారీగా తరలివచ్చిన ప్రజానీకం
  • సీఎం జగన్ ను భస్మాసురుడితో పోల్చిన చంద్రబాబు
  • దుర్మార్గమైన సీఎంను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విజయనగరం పర్యటనకు విచ్చేశారు. రాజాంలో భారీ సభ నిర్వహించారు. ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబులో ఉత్సాహం ఉప్పొంగింది. సభకు విచ్చేసిన పలువురు సైకిళ్లను పైకి ఎత్తి ప్రదర్శించి సమరోత్సాహం ప్రదర్శించారు. ఇక చంద్రబాబు ప్రసంగిస్తూ... గతంలో తాను చాలాసార్లు రాజాం వచ్చానని, కానీ ఈసారి తన సభకు వచ్చినంత జనసందోహాన్ని ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. 

తాను నిన్న ఖమ్మంలో సభ పెట్టానని, అక్కడ తమకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరూ లేకపోయినా భారీగా జనం తరలివచ్చారని, తనమీద వారికున్న నమ్మకానికి అది నిదర్శనం అని పేర్కొన్నారు. 

ఇక సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ను భస్మాసురుడితో పోల్చిన చంద్రబాబు, ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేరస్తుడే కాదు, అతడొక సైకో అని వ్యాఖ్యానించారు. కేసులు పెడతారని, గోడలు దూకే పోలీసులు ఉన్నారని విమర్శించారు. విశాఖలో తాను ఎయిర్ పోర్టుకు వస్తే టీడీపీ కార్యకర్తలను పోలీస్ కమిషనర్ బయటే నిలబెట్టాడని ఆరోపించారు. 

రాష్ట్రంలో వ్యవస్థలు నాశనం అయిపోయాయని, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని విమర్శించారు. "జగన్ బటన్ నొక్కుతాడు... పేదలకు రూ.10 ఇచ్చి రూ.100 తింటారు. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తయిందా? ప్రాజెక్టులు కట్టవు, పరిశ్రమలు రావు, దోపిడీ మాత్రం చేస్తావు. కరెంట్ చార్జీలను పెంచడమంటే పేదలను ఆదుకోవడమా?" అంటూ నిలదీశారు.


More Telugu News