ఇప్పటికే బూస్టర్ డోస్ తీసుకున్నవారు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ వేయించుకోవద్దు: కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్ కే అరోరా

  • దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నాసిల్ వ్యాక్సిన్
  • బూస్టర్ డోసు తీసుకోనివారు మాత్రమే వేయించుకోవాలన్న డాక్టర్ అరోరా
  • పదేపదే వ్యాక్సిన్ తీసుకుంటే శరీరం స్పందించడం ఆగిపోవచ్చని హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం మొదలయింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. మరోవైపు ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్, దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎన్ కే అరోరా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఫస్ట్ బూస్టర్ డోసు తీసుకునే వాళ్లకు మాత్రమే ముక్కు ద్వారా తీసుకునే టీకాను రెకమెండ్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రికాషన్ డోసు తీసుకున్న వారికి ఈ నాసిల్ వ్యాక్సిన్ ఇవ్వకూడదని అన్నారు. ప్రికాషన్ డోసు తీసుకోనివారికి మాత్రమే ఈ టీకాను రెకమెండ్ చేస్తున్నామని చెప్పారు. నాలుగో డోసు కింది ఈ వ్యాక్సిన్ ను అనుమతించమని తెలిపారు. 

ఎవరైనా ఒక వ్యక్తి పదేపదే యాంటిజెన్ వంటి వ్యాక్సిన్ తీసుకుంటే ఆ తర్వాత సదరు వ్యక్తి శరీరం స్పందించడం ఆగిపోవచ్చని డాక్టర్ అరోరా చెప్పారు. ఒకవేళ స్పందించినా ఆ స్పందన చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. అందువల్లే తొలుత రెండో డోసు వేసుకోవడానికి 6 నెలల గ్యాప్ విధించామని తెలిపారు. ఆ తర్వాత జనాలు 3 నెలల గ్యాప్ తో వ్యాక్సిన్ వేయించుకున్నారని... దీనివల్ల అనుకున్నంత ఫలితం రాలేదని చెప్పారు. ఈ కారణంగానే 4వ డోసు వద్దని చెపుతున్నామని వెల్లడించారు. 

18 ఏళ్లు పైబడిన వారందరూ నాసిల్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్ అరోరా తెలిపారు. రెండు ముక్కు రంద్రాల్లో నాలుగు చుక్కల చొప్పున వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందని చెప్పారు. 0.5 ఎం.ఎల్. వ్యాక్సిన్ ను వేస్తారని తెలిపారు. ఇది చాలా సేఫ్ వ్యాక్సిన్ అని... కొందరికి కొంత సేపు ముక్కు రంద్రాలు బ్లాక్ అయ్యే చిన్నపాటి అవకాశం మాత్రమే ఉంటుందని చెప్పారు.


More Telugu News