ట్రిపుల్​ సెంచరీతో రెచ్చిపోయిన పృథ్వీ షా

  • రంజీ మ్యాచ్ లో అసోం జట్టుపై విజృంభించిన ముంబై బ్యాటర్
  • టీమిండియాకు దూరమైన యువ క్రికెటర్
  • ఈ ఇన్నింగ్స్ తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన షా
భారత జట్టులో చోటు కోల్పోయిన ముంబై యువ బ్యాటర్ పృథ్వీ షా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అసోంతో జరుగుతున్న మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన పృథ్వీ షా వన్డే స్టయిల్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 379 పరుగులతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 443 పరుగులతో బాబాసాహెబ్ నింబాకర్ అత్యధిక స్కోరు నమోదు చేశాడు.  తొలి రోజే డబుల్ సెంచరీ (240 పరుగులు) మార్కు దాటిన షా.. రెండో రోజు, బుధవారం కూడా అసోం బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 

తొలి సెషన్ లోనే ట్రిపుల్ సెంచరీ మార్కు దాటాడు. అతని జోరు చూస్తుంటే నాలుగు వందల రన్స్ చేసేలా కనిపించాడు. కానీ, రియాన్ పరాగ్ ఎల్బీ డబ్ల్యూ చేయడంతో మూడో వికెట్ కు అజింక్యా రహానే (131 బ్యాటింగ్) 401 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లంచ్ విరామ సమయానికి ముంబై 125.1 ఓవర్లలో 598/3 స్కోరుతో నిలిచింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత అయినా పృథ్వీకి జాతీయ జట్టు నుంచి తిరిగి పిలుపు వస్తుందేమో చూడాలి.


More Telugu News