శామ్ సంగ్ ఫోన్ వాడుతున్న మైక్రోసాఫ్ట్ మాజీ బాస్ బిల్ గేట్స్

  • శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4 వాడుతున్నట్టు వెల్లడి
  • రెడిట్ ఆస్క్ మీ ఎవ్రీథింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బిల్ గేట్స్
  • ఈ ఫోన్ ను తనకు శామ్ సంగ్ అధినేత ఇచ్చినట్టు ప్రకటన
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్ గేట్స్ ఏ ఫోన్ వాడుతుంటారో తెలుసా..? శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4. మైక్రోసాఫ్ట్ ఫోన్లు మార్కెట్లో (యూఎస్ లో) ఉన్నప్పుడు ఆయన శామ్ సంగ్ ఫోన్ వాడడం ఏంటి? అన్న సందేహం వస్తుంది. ఇటీవల రెడిట్ ప్లాట్ ఫ్లామ్ పై ‘ఆస్క్ మీ ఎవ్రీథింగ్’ కార్యక్రమంలో బిల్ గేట్స్ పాల్గొన్నారు. తాను శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ను వాడుతున్న విషయాన్ని బిల్ గేట్స్ స్వయంగా వెల్లడించారు. 

ఇంతకుముందు అయితే తన రోజువారీ జీవితంలో శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ వినియోగించే వాడినని, గతంలో నిర్వహించిన ఆస్క్ మీ ఎవ్రీథింగ్ కార్యక్రమంలో బిల్ గేట్స్ వెల్లడించారు. అంటే జెడ్ ఫోల్డ్ 3 నుంచి, 4కు ఆయన అప్ గ్రేడ్ అయ్యారు. విషయం ఏమిటంటే దక్షిణ కొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్ సంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన జే వై లీ ఈ ఫోన్ ను బిల్ గేట్స్ కు ఇచ్చారట. 

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో ఫోల్డబుల్ ఫోన్ ఉన్నప్పటికీ బిల్ గేట్స్ శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4కు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. తాను నిత్య జీవితంలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటానని గేట్స్ తెలిపారు. శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్ డిఫాల్ట్ గా లోడ్ అయ్యి ఉంటాయి. ఈ ఫోన్ కోసమే ప్రత్యేకంగా వాటిని రూపొందించారు. తాను టాబ్లెట్ వాడనంటూ, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్క్రీన్ సైజు పెద్దగా ఉండడంతో, రోజువారీ పనుల కోసం అది సరిపోతున్నట్టు బిల్ గేట్స్ చెప్పారు.


More Telugu News