73 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక... 317 పరుగుల భారీ తేడాతో భారత్ విక్టరీ

  • తిరువనంతపురంలో చివరి వన్డే
  • తొలుత 5 వికెట్లకు 390 రన్స్ చేసిన భారత్
  • కోహ్లీ, గిల్ సెంచరీలు
  • లక్ష్యఛేదనలో చేతులెత్తేసిన శ్రీలంక
  • వన్డే చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు చేసిన భారత్
మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా అత్యంత ఘనంగా ముగించింది. తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 391 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక అత్యంత పేలవంగా 73 పరుగులకు కుప్పకూలింది. 

సిరాజ్ 4 వికెట్లతో శ్రీలంకను హడలెత్తించగా, షమీ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన అషేన్ బండార బ్యాటింగ్ కు దిగలేదు. అతడిని అబ్సెంట్ హర్ట్ గా పరిగణించారు. 

లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆ జట్టులో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్), కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు. 

కాగా, వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2008లో ఐర్లాండ్ జట్టును న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడా రికార్డును టీమిండియా తిరగరాసింది. 

నేటి మ్యాచ్ లో విజయంతో భారత్ వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.


More Telugu News