‘క్యూనెట్’కు సానియా మీర్జా ప్రచారం.. ఇలాంటి వాటికి ప్రచారం వద్దన్న సజ్జనార్

  • ఎంఎల్ఎం కంపెనీలకు సెలబ్రిటీల ప్రచారం సరికాదన్న సజ్జనార్
  • ఇలాంటి సంస్థల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్న ఆర్టీసీ ఎండీ
  • గతంలో ‘క్యూనెట్‌’పై ఉక్కుపాదం మోపిన సజ్జనార్
మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ అయిన ‘క్యూనెట్’కు హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. ఎంఎల్ఎం కంపెనీలకు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం, సపోర్ట్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి సంస్థల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందంటూ ట్వీట్ చేశారు. సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో క్యూనెట్‌తోపాటు పలు ఎంఎల్ఎం కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.

క్యూనెట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతవారం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్, హవాలా ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహించింది. క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లోనూ సోదాలు జరిగాయి. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, క్యూనెట్‌కు చెందిన 36 బ్యాంకుల్లో దాదాపు రూ.90 కోట్లు ఫ్రీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.  

2019 జనవరిలో ‘క్యూనెట్‌’ మోసాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ (ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌)ను రంగంలోకి దింపి క్యూనెట్‌పై ఉక్కుపాదం మోపారు. నిందితులను కటకటాల వెనక్కి పంపారు. రూ. కోట్లలో డబ్బును ఫ్రీజ్‌ చేశారు. దీంతో కొంతకాలం విరామం ఇచ్చిన క్యూనెట్ మళ్లీ రంగంలోకి దిగింది.


More Telugu News