6 వేల మందిని తొలగిస్తున్నాం.. ఫిలిప్స్ ప్రకటన

  • మూడు నెలల కిందట 4 వేల మందిని తొలగించిన కంపెనీ
  • భారీ నష్టాల నేపథ్యంలో ఖర్చు తగ్గించుకునే చర్యలు
  • 2025 నాటికి ఉద్యోగుల్ని త‌గ్గించ‌డం అత్యవసరమన్న ఫిలిప్స్ సీఈవో రాయ్ జాక‌బ్స్
టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఆగడం లేదు. తాజాగా మరో కంపెనీ వేలాది మందిని తీసేసేందుకు సిద్ధమైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు నెద‌ర్లాండ్స్‌కు చెందిన వైద్య ప‌రిక‌రాల సంస్థ ఫిలిప్స్ ప్రకటించింది. ‘‘ఇది క‌ష్ట‌స‌మ‌య‌ం.  కానీ 2025 నాటికి ఉద్యోగుల్ని త‌గ్గించ‌డం అత్యవసరం’’ అని కంపెనీ సీఈవో రాయ్ జాక‌బ్స్ సోమవారం చెప్పారు. 

ఫిలిప్స్ త‌యారు చేసిన స్లీప్ రెస్పిరేట‌ర్లపై ఫిర్యాదులు రావడం.. వాటిని భారీ స్థాయిలో రీకాల్ చేయడంతో నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. 3 నెల‌ల కిందటే నాలుగు వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ఫిలిప్స్ ప్ర‌క‌టించింది.

గ‌త ఏడాది నాలుగో త్రైమాసికంలో సుమారు 105 మిలియ‌న్ యూరోల న‌ష్టం వచ్చినట్లు ఫిలిప్స్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. గ‌త ఏడాది మొత్తంగా సుమారు 1.605 బిలియ‌న్ యూరోలు నష్ట‌పోయింది. రెస్పిరేట‌ర్లను రీకాల్ చేయ‌డం వ‌ల్ల ఎక్కువగా న‌ష్టం వాటిల్లింది. 

నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారి కోసం త‌యారు చేసిన రెస్పిరేటర్ల‌లో నాణ్య‌త లోపం వ‌చ్చింది. అమెరికాలో ఆ ఉత్ప‌త్తిపై ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో 2021లో ఆ ప‌రిక‌రాలను రీకాల్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో దీనిపై దర్యాప్తు జరుగుతోంది.


More Telugu News