తొలి టెస్టు పిచ్ పై ఆస్ట్రేలియా మీడియా అతి.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన రోహిత్ శర్మ

  • రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ లో తొలి టెస్టు
  • తమకు అనుకూలంగా పిచ్ ను మార్చిందంటూ భారత జట్టుపై ఆసీస్ మీడియా విమర్శలు
  • పిచ్ పై కాకుండా మ్యాచ్ పై దృష్టి పెడితే మంచిదని రోహిత్ హితవు
భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ గురువారం నాగ్ పూర్ లో మొదలవనుంది. ఈ సిరీస్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీడియా దృష్టి కూడా ఎక్కువగా ఉంది. అయితే, భారత్ తో ఆట అనగానే కాస్త అతిచేసే ఆస్ట్రేలియా మీడియా ఈసారి కూడా అదే చేసింది. మ్యాచ్ మొదలవకముందే నాగ్‌పూర్ పిచ్‌పై విమర్శలు చేస్తోంది. ఫలితం తమకు అనుకూలంగా వచ్చేందుకు ఆతిథ్య భారత జట్టు ఈ పిచ్ ను మార్చిందంటూ ఆరోపిస్తోంది. కొంతమంది ఆస్ట్రేలియా జర్నలిస్టులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు దీనిపై రచ్చ చేస్తున్నారు. 

దీనిపై బుధవారం విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.  పిచ్‌పై కాకుండా మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని అన్నాడు. ‘మీరు పిచ్‌పై కాకుండా క్రికెట్‌పై దృష్టి పెట్టండి. మ్యాచ్ ఆడే మొత్తం 22 మంది నాణ్యమైన ఆటగాళ్లే’ అని చెప్పాడు. ఇక, నాగ్ పూర్ పిచ్  స్పిన్నర్లకు సహకారం అందించేలా ఉందన్నాడు. అందువల్ల బ్యాటర్లు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఒక్కో పరుగు జోడించాల్సిన అవసరం ఉందన్నాడు.


More Telugu News