ఒక మాజీ మంత్రిని పోలీస్ స్టేషన్ లో నేలపై కూర్చోబెడతారా?: అచ్చెన్నాయుడు ఫైర్

  • జవహర్ ను పీఎస్ లో నేలపై కూర్చోబెట్టిన పోలీసులు
  • దళితులంటే జగన్ కు చిన్నచూపా? అని ప్రశ్న
  • జవహర్ ను అవమానించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్
టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రిగా పని చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో నేలపై కూర్చోబెట్టి అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులంటే సీఎం జగన్ కు అంత చిన్న చూపా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో దళితులు కుర్చీలో కూర్చోవడానికి కూడా అర్హులు కారా? అని దుయ్యబట్టారు. దళిత నేతలను జగన్ తన ఇంటి గుమ్మం వద్దకు కూడా రానివ్వడం లేదని విమర్శించారు. టీడీపీ దళిత నేతలను పోలీస్ స్టేషన్లలో నేలపై కూర్చోబెడుతున్నారని అన్నారు. దళితజాతిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. జవహర్ ను అవమానించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  

నిన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో జవహర్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆయనను నేలపై కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి, పోలీసులపై అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.


More Telugu News