ప్రధాని మోదీకి చైనీయులు పెట్టుకున్న ముద్దు పేరు ఇదే..!

  • చైనాలో మోదీకి గొప్ప పాప్యులారిటీ 
  • మోదీని అసాధారణ నేతగా భావిస్తున్న చైనా ప్రజలు
  • అమెరికా పత్రిక డిప్లొమాట్‌లో కథనం
  • భారత ప్రధానిని ‘మోదీ లాక్షియన్’ అని పిలుచుకుంటున్న చైనీయులు
భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ చైనీయుల దృష్టిలో భారత ప్రధాని మోదీ ఓ అసాధారణ నేతగా నిలిచారు. చైనాలో మోదీకి మంచి పాప్యులారిటీ ఉందంటూ అమెరికా పత్రిక డిప్లొమాట్ తాజాగా ఓ కాలమ్‌ను ప్రచురించింది. మోదీ నాయకత్వంలో భారత్.. అగ్రదేశాలతో దౌత్యసంబంధాల విషయంలో సమతూకం పాటిస్తోందంటూ చైనా జర్నలిస్టు ము షుంసాన్  అందులో పేర్కొన్నారు. చైనా నెటిజన్లు భారత ప్రధానిని ‘మోదీ లాక్షియన్’ అని పిలుచుకుంటున్నారు. అసాధారణ ప్రజ్ఞ ఉన్న వృద్ధుడైన దివ్య పురుషుడని దీని అర్థం.  

మోదీ వస్త్రధారణ, రూపం విభిన్నంగా ఉంటాయని, ఆయన విధానాలు గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని ము షుంషాన్ విశ్లేషించారు. రష్యా, అమెరికా, దక్షిణ దేశాలతో స్నేహంగా ఉంటూ మోదీ వాటి మధ్య సమతూకం పాటిస్తారని వ్యాఖ్యానించారు. చైనా ప్రజల దృష్టిలో మోదీకి ఓ అసాధారణ స్థానముందని కూడా పేర్కొన్నారు. చైనా ప్రజలు ఓ విదేశీ నేతకు ముద్దుపేరు పెట్టడం ఎప్పుడూ చూడలేదని కూడా పేర్కొన్నారు. చైనా సోషల్ మీడియా వేదికైన ‘సైనా వీబో’లో మోదీ 2015లో చేరినట్టు చెప్పారు. ఆయనకు 2.44 లక్షల ఫాలోవర్లు ఉండేవారని, అయితే.. 2020లో చైనా యాప్‌లపై భారత్ విధించిన నిషేధం కారణంగా మోదీ తన అకౌంట్‌ను మూసేశారని చెప్పుకొచ్చారు.


More Telugu News