ఇలా చేస్తే ఏసీ లేకపోయినా మీ ఇల్లు చల్లగా ఉంటుంది!

  • వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
  • పెరిగిపోయే వేడి నుంచి రక్షణకు ఎన్నో సహజ మార్గాలు
  • ఇంటి పైన కూల్ పెయింట్ వేయించుకోవడం మంచి ఆప్షన్
  • ఇంటిపైన నీడ పడేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు
  • తెల్లటి సిరామిక్ టైల్స్ తో ఫ్లోరింగ్ చేయించుకున్నా ఫలితాలు
వేసవి వచ్చిందంటే మండే ఎండలు చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తుంటాయి. పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం, తరిగిపోతున్న వృక్ష సంపద అన్నీ కలసి వేసవి ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి. వాతావరణంలో సమతుల్యత అన్నది ఎప్పుడో గతి తప్పింది. ఎండ అయినా, వర్షాలు అయినా, చలి అయినా తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. మరి ఈ వేసవిలో మండే ఎండల నుంచి రక్షణ కల్పించుకునేందుకు ఏసీ కాకుండా, అందుబాటులో ఉన్న ఇతర సహజ మార్గాలేమిటో చూద్దాం.

గది ఉష్ణోగ్రత పెరిగిపోతే ఏసీల వాడకం మరింత అధికమవుతుంటుంది. కానీ, ఇంట్లో ప్రతి రూమ్ లోనూ ఏసీ పెట్టుకోవడం సాధ్యపడదు. ఎక్కువ మంది ఇళ్లల్లో బెడ్ రూమ్ లోనే ఏసీ కనిపిస్తుంది. కానీ, కిచెన్, బాత్ రూమ్, హాల్ ఇలా ఇల్లంతా ఏసీ లేకపోయినా గది ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలను చూడాల్సిందే. 

రూఫ్ పెయింట్
 గతంలో కూల్ సిమెంట్, కూల్ పెయింట్ పేరుతో చాలా రకాల ఉత్పాదనలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ, అవేమీ పెద్ద విజయం సాధించలేదు. ఒక్క వర్షానికే కూల్ సిమెంట్ అంతా కొట్టుకుపోయేది. కానీ, ఇటీవలి కాలంలో ప్రముఖ పెయింట్ కంపెనీలు కూల్ రూఫ్ పెయింట్, లీక్ ప్రూఫ్ పెయింట్ లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని ఇంటి పైకప్పు మీద వేయిస్తే.. సమారు 10-12 డిగ్రీల వరకు గది ఉష్ణోగ్రత తగ్గుతుంది. 

ఏషియన్ పెయింట్స్ అయితే స్మార్ట్ కేర్ డ్యాంప్ ప్రూఫ్ పేరుతో ఒక ఉత్పత్తిని విక్రయిస్తోంది. ఇంటి గోడలకు పెయింట్ కోటింగ్ వేసినట్టుగానే.. ఇంటి పై భాగంలో ఫ్లోరింగ్ పై ఈ పెయింట్ వేస్తారు. కనీసం ఐదేళ్ల వరకు ఇది పనిచేస్తుంది. దీనివల్ల గది లోపలి ఉష్ణోగ్రత కనీసం 10 డిగ్రీలు వరకు తగ్గుతుంది. అంతేకాదు, వర్షపు నీరు లీక్ కాకుండా ఈ పెయింట్ కోటింగ్ పనిచేస్తుంది. ప్రముఖ ఆలయాల్లో భక్తులు నడిచేందుకు నేలపై తెల్లటి పెయింట్ వేయడం చూసే ఉంటారు. ఇది కూడా అలాంటిదే. డాక్టర్ ఫిక్సిట్ కూడా కూల్ పెయింట్ ను ఆఫర్ చేస్తోంది. అలాగే బెర్జర్ పెయింట్స్, డ్యూలక్స్ సహా అన్ని ప్రముఖ కంపెనీలు ఈ తరహా ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. కొన్నేళ్ల వరకు గ్యారంటీని కూడా ఇస్తున్నాయి. వీటితో 30 శాతం వరకు విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చు.

తెల్లటి సున్నంలో కెమికల్ కలిపి వేస్తుంటారు. కానీ, ఇది వర్షాలకు ఉండదు. కొట్టుకుపోతుంటుంది. ఒక్క ఏడాదికి కూడా పూర్తి రక్షణ ఇవ్వదు. ఇలాంటి మన్నిక లేని ఉత్పత్తుల కంటే పెయింట్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న కూల్ పెయింట్ మెరుగైన ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఒక ఇంటి మొత్తానికి కూల్ పెయింట్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు.  

టైల్స్
 ఇంటిపైన తెల్లటి సిరామిక్ టైల్స్ వేసుకోవడం మరొక ఆప్షన్.  అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంటి లోపలి వాతావరణం మరింత వేడెక్కకుండా  ఉంటుంది. తెల్లటి టైల్స్ కావడంతో సూర్యుడి కిరణాలను పరావర్తనం చెందిస్తాయి. నిపుణుల సాయంతోనే ఈ పని చేయించుకోవాలి.

నీడ..
ఇంటి రూఫ్ కాంక్రీట్ నిర్మాణం. పగటి వేళ అధిక వేడిని కాంక్రీటు నిర్మాణాలు గ్రహిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ వేడిని కాంక్రీటు భవనాలు క్రమంగా విడుదల చేస్తుంటాయి. అందుకని ఇంటి కప్పుపై ఎండ పడకుండా షేడ్స్ ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి మార్గం. ఇందుకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 

సోలార్ ప్యానెళ్లు
ఇంటిపైన సోలార్ ప్యానెళ్లను ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవైపు ఇంటికి కావాల్సిన విద్యుత్ ను ఉచితంగా తయారు చేసుకోవచ్చు. మరోవైపు ఇంటిపై ఎండ ఎక్కువ పడకుండా సోలార్ ప్యానెళ్ల రూపంలో రక్షణ కల్పించుకోవచ్చు.  

ఫ్లోరింగ్
చెక్క, టెర్రకోట టైల్స్ అనేవి కాంక్రీటు మాదిరిగా ఎక్కువ వేడిని గ్రహించవు. దీంతో ఆ వేడిని కింది అంతస్తులకు బదిలీ చేయడం తక్కువే. జాన్సన్ ఎండ్యూరా ఈ తరహా టైల్స్ ను ఆఫర్ చేస్తోంది.

రూఫ్ గార్డెనింగ్
 ఇంటి పైకప్పు మీద పచ్చని చెట్లు, గడ్డితో ఫ్లోరింగ్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో ఒకటి. కాకపోతే ఇంటిపైన మొక్కలు పెంచుకునేవారు, వాటర్ లీకేజీ రక్షణతో ఉన్న భవనమేనా? అన్నది విచారించుకోవాలి. 

ఇతర మార్గాలు
  • విండోల నుంచి వేడిగాలి లోపలకు రాకుండా చూసుకోవాలి. కిటికీలకు ఉండే రక్షణ కర్టెయిన్లను కిందకు దింపాలి. అలాగే, ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల మధ్య విండోలు తెరిచి ఉండాలి. దీనివల్ల గది ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది. 
  • వేసవిలో పడక కోసం పాలిస్టర్, శాటిన్, సిల్క్ వస్త్రాలను ఉపయోగించకూడదు. కాటన్ అన్ని విధాలుగా మంచిది. 
  • కిటికీల వద్ద కుండీల్లో మొక్కలు పెట్టుకున్నా కొంత మేర ఉపశమనం లభిస్తుంది.
  • కిటికీల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ లేదంటే కనీసం న్యూస్ పేపర్ తో అయినా అంటించాలి. 
  • సీలింగ్ ఫ్యాన్ ను టాప్ స్పీడ్ లో కాకుండా మీడియం స్పీడ్ లో పెట్టుకోవాలి.


More Telugu News