పెరుగుతున్న కొవిడ్ కేసులతో కేరళ అప్రమత్తం.. వారికి మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం

  • కేరళ్లలో గత 24 గంటల్లో 1,801 కేసుల నమోదు
  • 60 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్న ఆరోగ్య మంత్రి
  • గర్భిణులు, వృద్ధులు మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న ప్రభుత్వం
కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,801 కేసులు నమోదయ్యాయి. దీంతో గర్భిణులు, వృద్ధులకు మాస్కును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరీక్షలను కూడా పెంచింది. రాష్ట్రంలోని మొత్తం కరోనా బాధితుల్లో 0.8 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్, 1.2 శాతం మందికి మాత్రమే ఐసీయూ పడకలు అవసరమని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు.

 ఆమె ఆధ్వర్యంలో నిన్న కరోనా పరిస్థితిపై సమావేశం జరిగింది. జినోమ్ సీక్వెన్స్ కోసం పంపిన నమూనాల్లో చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కరోనా మరణాలు ఎక్కువగా మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లకు పైబడిన వారిలోనే నమోదవుతున్నట్టు చెప్పారు. 

కరోనా మరణాల్లో దాదాపు 85 శాతం 60 ఏళ్లు పైబడిన వారిలోనే రికార్డవుతున్నట్టు తెలిపారు. మిగతా 15 శాతం మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. అలాగే, ఇంటి నుంచి బయటకు వెళ్లని ఐదుగురు కరోనాతో మరణించినట్టు వివరించారు. లైఫ్ స్టైల్ వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు పెద్దలు, గర్భిణులు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు.


More Telugu News