మహారాష్ట్రలో టికెట్ కొని రైలు ఎక్కేందుకు గుజరాత్ లో అడుగుపెట్టాలి! పశ్చిమ రైల్వే జోన్ లో వింత రైల్వే స్టేషన్

  • నవాపూర్ రైల్వే స్టేషన్ దేశంలోనే ప్రత్యేకం
  • రాష్ట్ర విభజనలో పంచుకున్న రెండు రాష్ట్రాలు
  • రాష్ట్రాలు విడదీసినా రైల్వే కలిపే ఉంచింది
మహారాష్ట్రలోని ఓ రైల్వే స్టేషన్ దేశంలోనే ప్రత్యేకం.. ఎందుకంత ప్రత్యేకమంటే, ఈ స్టేషన్ లో టికెట్ కొన్నవారు అంతా పక్కనే ఉన్న గుజరాత్ లోకి వెళ్లి రైలు ఎక్కుతుంటారు. స్టేషన్ మేనేజర్ కూడా గుజరాత్ లో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. స్టేషన్ లోపల ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బెంచీ కూడా సగ భాగం మహారాష్ట్రలో ఉంటే మిగతా సగం పక్క రాష్ట్రం గుజరాత్ లో ఉంటుంది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల ఈ రైల్వేస్టేషన్ కు ఆ ప్రత్యేకత ఏర్పడింది.

పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోని నవాపూర్ రైల్వే స్టేషన్ ఈ ప్రత్యేకతను కలిగి ఉంది. స్టేషన్ పొడవు 800 మీటర్లు ఉండగా.. రాష్ట్ర విభజన సమయంలో ఇందులో 500 మీటర్లు గుజరాత్ లోని తాపి జిల్లాలో, మిగతాది మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోకి వెళ్లింది. అయితే, రాష్ట్రాలు విడదీసిన ఈ స్టేషన్ ను భారతీయ రైల్వే శాఖ కలిపి ఉంచుతోంది.

ఈ స్టేషన్ లోని ఓ బెంచీపై సెల్ఫీలు దిగడానికి ప్రయాణికులు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎందుకంటే.. సగం ఒక రాష్ట్రంలో మిగతా సగం మరో రాష్ట్రంలో ఉందీ బెంచ్! ఇందులో ఓవైపు కూర్చుంటే మహారాష్ట్రలో, పక్కన కూర్చున్న వారు గుజరాత్ లో ఉంటారు.


More Telugu News