అశోక్‌ గెహ్లాట్‌ కు సోనియాగాంధీ నాయకురాలు కాదేమో!.. వసుంధర రాజే అనుకుంట!: సచిన్ పైలట్ వ్యంగ్యం

  • గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఇప్పుడు అర్థమైందన్న సచిన్ పైలట్ 
  • కాంగ్రెస్‌ సీఎం అయ్యుండి బీజేపీ నేతలను ప్రశంసించడం మొదటిసారి చూస్తున్నానని విమర్శ 
  • అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 11న యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడి
రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ , మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధర రాజేను గెహ్లాట్‌ ప్రశంసించడంపై సచిన్‌ పైలట్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై విమర్శలు చేస్తూ.. బీజేపీ నేతలను ప్రశంసించడాన్ని మొదటిసారి చూస్తున్నానని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. 

‘‘ధోల్‌పూర్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రసంగించిన తీరు చూస్తుంటే ఆయనకు సోనియాగాంధీ నాయకురాలు కాదేమో!.. వసుంధర రాజే నాయకత్వంలో ఆయన పనిచేస్తున్నారేమో అనిపిస్తోంది’’ అని సచిన్‌ పైలట్‌ ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్నా.. నేను పదేపదే కోరుతున్నా.. వసుంధర రాజే ప్రభుత్వం చేసిన అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఇప్పుడు అర్థమైందని విమర్శించారు.

అవినీతికి వ్యతిరేకంగా తాను ఈ నెల 11న అజ్మీర్‌లో జన సంఘర్ష్‌ యాత్ర మొదలుపెడుతున్నానని సచిన్ ప్రకటించారు. ఈ యాత్ర ఐదు రోజుల తర్వాత జైపూర్‌లో ముగుస్తుందని ఆయన చెప్పారు. తాను తీసుకోబోయే ఏ నిర్ణయమైనా యాత్ర తర్వాతే వెల్లడిస్తానని పైలట్‌ తెలిపారు.

అయితే తాను పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల ముందు కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీయాలని అనుకోవడం లేదన్నారు. గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకుని తాను యాత్ర చేపట్టడం లేదన్నారు. ఈ యాత్ర ఎవరికీ వ్యతిరేకం కాదు. అవినీతికి వ్యతిరేకమని ఆయన తెలిపారు.

‘‘తన ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ ప్రయత్నించిందని గెహ్లాట్ తొలుత ఆరోపించారు. తర్వాతేమో.. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో బీజేపీ సాయం చేసిందని చెప్పారు. ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఆయన (గెహ్లాట్) నన్ను గద్దర్ (ద్రోహి), నికమ్మ (పనికిరానివాడు), కరోనా అని అన్నారు. నాపై చాలా ఆరోపణలు, దూషణలు చేశారు. నేను పార్టీని దెబ్బతీయకూడదనుకున్నాను. అందుకే ఏమీ మాట్లాడలేదు’’ అని చెప్పుకొచ్చారు.


More Telugu News