కచ్చితంగా పొత్తు ఉంటుంది.. మన టార్గెట్ వైసీపీ: పవన్ కల్యాణ్

  • జూన్ నుండి రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారమన్న జనసేనాని
  • త్రిముఖ పోటీలో జనసేన బలికావడానికి సిద్ధంగా లేదని వ్యాఖ్య
  • వైసీపీని గద్దె దించడమే మన లక్ష్యమన్న పవన్
  • నాదెండ్లను టార్గెట్ చేసిన వారికి పవన్ కల్యాణ్ హెచ్చరిక
వచ్చే ఎన్నికల్లో పొత్తు కచ్చితంగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను జూన్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుడతానని చెప్పారు. డిసెంబర్ లో ఎన్నికలు రావొచ్చునని జోస్యం చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం అలయెన్స్ తప్పనిసరి అని, పొత్తుకు నేను సిద్ధంగా ఉన్నానని, కానీ వారు వద్దనుకుంటే నాకు తెలియదని చెప్పారు. తనను ముఖ్యమంత్రి అని నినాదాలు ఇచ్చేవారికి ఒకటే చెబుతున్నానని, జనసేనకు 48 శాతం ఓటింగ్ ఇస్తే, అప్పుడు నేనే సీఎం అవుతానని చెప్పారు. అంత ఓటు రానప్పుడు మనం ఎలా అడగగలమన్నారు.

 ఇది క్లియర్... మన వైరి పక్షం వైసీపీ

వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీలో జనసేన బలి కావడానికి సిద్ధంగా లేదన్నారు జనసేనాని. అసలు మన ప్రత్యర్థి ఎవరనేది మొదటి టార్గెట్ అని, ఆ తర్వాత పదవులు అన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని, రోడ్లు వేయలేని, పోలవరం పూర్తి చేయలేని, ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వలేని వ్యక్తి లేదా పార్టీ మన ప్రత్యర్థి అన్నారు. ఆయన వైఫల్యాలు పెద్ద లిస్ట్ అవుతుందని చెప్పారు. ఇది క్లియర్... మన వైరి పక్షం వైసీపీ అని స్పష్టం చేశారు. ఏపీని అధోగతి పాలు చేసిన, గూండాయిజాన్ని పెంచిపోషించిన పార్టీ వైసీపీ అన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్నారు. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటి వారిని మనం వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా చూడాలా? లేక టీడీపీనా? అని ప్రశ్నించారు. దేవాలయాలను కూల్చేస్తే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు.

ముఖ్యమంత్రి లక్ష్యం కాదు..


మన టార్గెట్ ముఖ్యమంత్రి అవ్వాలని కాదని పవన్ అన్నారు. మన ప్రధాన పక్షం వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది తర్వాత చర్చ అన్నారు. తనకు ఎవరి పైన ప్రేమ లేదు, అలాగని ద్వేషం లేదన్నారు. ప్రజలకు ఏం చేయడం లేదని వైసీపీ పైన కోపం ఉందన్నారు. అలయెన్స్ లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయపడ్డారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది ఆ రోజును బట్టి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి వైసీపీని గద్దె దించడం తమ ప్రాధాన్యత అన్నారు.

ద్వైపాక్షిక చర్చల్లా...

అలయెన్స్ కూడా ఆషామాషీగా ఉండదని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఎలా జరుగుతాయో అలాగే అలయెన్స్ కూడా ఏం చేయగలదో ప్రజల ముందు, మీడియా ముందు బాహాటంగా ఉంటుందన్నారు. నాలుగు గోడల మధ్య చర్చ జరగదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని తాను అనుకుంటున్నానని చెప్పారు.

నాదెండ్లను టార్గెట్ చేస్తే సస్పెండ్ చేస్తా..


జనసేన కోసం నాదెండ్ల మనోహర్ ఎంతో చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని కొంతమంది టార్గెట్ చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసే ఇలాంటి వారిని టార్గెట్ చేస్తే తాను వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. తనకు శత్రువులు ఉన్నా పోరాటం చేస్తానని, అనుకూల శత్రువులు మాత్రం వద్దన్నారు. నాదెండ్ల పార్టీ కోసం ఎంతో చేస్తున్నారని, ఆయన ఉమ్మడి ఏపీ స్పీకర్ అని, మాజీ సీఎం కొడుకు అని గుర్తు చేశారు.


More Telugu News