పవన్ నీ మార్కెట్ ఎంత... నీ సినిమా ఒక్కటైనా రూ.100 కోట్లు దాటిందా?: పేర్ని నాని

  • ఏపీలో భీమ్లానాయక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్న పవన్
  • రూ.30 కోట్లు నష్టం వచ్చిందని వెల్లడి
  • రండి లెక్కలు తేల్చుకుందామన్న పేర్ని నాని 
ఏపీలో భీమ్లా నాయక్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారని, దాంతో రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని ఇటీవల పవన్ కల్యాణ్ పేర్కొనడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. 

"జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రానికి రూ.30 కోట్ల నష్టం కలిగించారని పవన్ కల్యాణ్ అంటున్నాడు. ఈ సందర్భంగా నేను పవన్ కల్యాణ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా... ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే మీకు రూ.30 కోట్లు నష్టం వచ్చిందా? అసలు మీ సినిమా మార్కెట్ ఎంత? మీ జీవితంలో ఆంధ్రా, తెలంగాణ కలిపి రూ.100 కోట్ల షేర్ దాటిన సినిమా ఒక్కటైనా ఉందా? లేదా, ఆంధ్రాలో రూ.100 కోట్లు దాటిన సినిమా ఏదైనా ఉందా?

భీమ్లా నాయక్ చిత్రానికి పెట్టుబడి ఎంత పెట్టారు? నష్టం రావడం అంటే ఏంటి... ఆ ప్రొడ్యూసర్ ను లెక్కలు చెప్పమనండి! పెట్టుబడి ఎంత, సినిమాకైన ఖర్చు ఎంత, రెమ్యునరేషన్ లు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు? బ్లాక్ ఎంత... వైట్ ఎంత? సినిమా కలెక్షన్లు ఎంత? లెక్కెట్టుకుందాం రండి!

సినిమా బాగుంటే జనం చూస్తారు కానీ... సినిమా బాగా లేకపోతే జగన్ మోహన్ రెడ్డి ఏంచేస్తారు? భీమ్లా నాయక్ సినిమా చూడండి అంటూ ప్రభుత్వం ప్రేక్షకులకు ఎదురు డబ్బులు ఇచ్చి పంపించాలా?" అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. 

అంతేకాదు, పవన్ కల్యాణ్ వారాహి వాహనం ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నించారు. ఎప్పుడైనా వరుసగా 10 రోజులు జనసేన కోసం పనిచేశారా? అని పవన్ ను నిలదీశారు. "పట్టుమని 10 రోజులు ఏపీలో ఉండి తిరిగారా? ఎప్పుడో ఓసారి వచ్చి రెండ్రోజులు తిరిగి మళ్లీ ప్యాకప్ చెబుతారు?" అంటూ పేర్ని నాని విమర్శించారు.


More Telugu News