కరీంనగర్‌లో పాప.. తమ కూతురేనంటున్న ఏపీకి చెందిన రెండు కుటుంబాలు!

  • 8 ఏళ్ల చిన్నారిని పెంచుకుంటున్న కరీంనగర్ జిల్లా మహిళ
  • పాప ఆంధ్రా యాస మాట్లాడుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్టు చెప్పిన మహిళ
  • బాలరక్షా భవన్‌లో అప్పగించిన పోలీసులు
  • బాలిక కోసం తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుటుంబాల మధ్య గొడవ
కరీంనగర్ బాలరక్షా భవన్‌లో ఆశ్రయం పొందుతున్న 8 ఏళ్ల బాలిక కోసం ఏపీకి చెందిన రెండు కుటుంబాలు గొడవకు దిగాయి. ఆమె మా అమ్మాయి.. అంటే కాదు మా అమ్మాయేనంటూ ఇరు కుటుంబాలు గొడవకు దిగాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామానికి చెందిన గాదెపాక లక్ష్మి.. అక్ష అనే బాలికను తీసుకొచ్చి పెంచుకుంటోంది.

చిన్నారి ఆంధ్రా యాసలో మాట్లాడుతుండడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఉప్పందించారు. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మిని పిలిపించి విచారించారు. హైదరాబాద్‌లోని ఆండాళ్ అనే మహిళ ద్వారా అమ్మాయిని తాను తీసుకొచ్చినట్టు ఆమె చెప్పింది. దీంతో ఈ నెల 8న చిన్నారిని స్వాధీనం చేసుకుని బాలరక్ష భవన్‌లో అప్పగించారు. 

చిన్నారి ఐదేళ్ల క్రితం తప్పిపోయినట్టు తెలుసుకున్న పోలీసులు ఏపీలోని స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సమాచారం అందించారు. విషయం తెలిసిన తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కర్ర గ్రామానికి చెందిన రేపల్లి పద్మ- భగవాన్‌దాస్‌ దంపతులు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లకు చెందిన పొన్నాడ రవిచంద్రన్‌ కుటుంబాలు నిన్న కరీంనగర్‌లోని బాలరక్ష భవన్‌కు చేరుకుని పాప తమ అమ్మాయేనని తమకు అప్పగించాలని ఎవరికి వారే కోరడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.

చిన్నారిని చూడగానే ఎవరికి వారే తమ కుమార్తెనేంటూ అక్కడే గొడవ పడ్డారు. దీంతో ఇక లాభం లేదని బాలికను వారి ముందుకు తీసుకురాగా తల్లిదండ్రులను గుర్తించలేకపోయింది. దీంతో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. పాప తమ కుమార్తేనని నిరూపించే ఆధారాలు చూపించాలని ఇరు కుటుంబాలను ఆదేశించారు. లేదంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పాప తల్లిదండ్రులను గుర్తిస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు.


More Telugu News