పవన్ జోరు పెంచడంతో జగన్ లో ఈ దుష్ట ఆలోచన మొదలైంది: నిమ్మల రామానాయుడు

  • ఒంటరి కులాల్లోని ప్రముఖులపై జగన్ వేధింపులు ఎక్కువయ్యాయన్న నిమ్మల
  • అందరూ తనతో ఉన్నారని జగన్ నమ్మించాలని ప్రయత్నిస్తున్నట్టు వెల్లడి
  • ముద్రగడతో చిలకపలుకులు పలికిస్తున్నారని వివరణ
  • ఎన్ని చేసినా జగన్ కు చివరికి మిగిలేది శూన్యమేనని స్పష్టీకరణ
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని ప్రముఖులపై జగన్ వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. 

భయపెట్టి లొంగదీసుకొని కొందరిని తన పంచన చేర్చుకొని, ఆయా వర్గాలన్నీ తనతో ఉన్నాయని నమ్మించే దుష్ట ఆలోచనలో జగన్ ఉన్నాడని ఆరోపించారు. నంద్యాలలో ప్రముఖ విద్యావేత్త శాంతారాముడిని వేధించి దారికి తెచ్చుకోవాలని జగన్ చూస్తున్నాడని, గతంలో మాజీ మంత్రి పొంగూరి నారాయణను ఇలాగే అక్రమ కేసులతో వేధించాడని రామానాయుడు వివరించారు. 

"పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో జోరుపెంచడంతో, ముద్రగడతో చిలుకపలుకులు పలికిస్తున్న జగన్, తానేదో కాపుల్ని ఉద్ధరించినట్టు మాట్లాడిస్తున్నాడు. కాపుల ద్రోహి జగన్... కాపుల నిజమైన నేస్తం చంద్రబాబే. రూ.5 వేల కోట్లతో చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెడితే, జగన్ దాన్ని నిర్వీర్యం చేశాడు. చంద్రబాబు తీసుకొచ్చిన 5 శాతం రిజర్వేషన్లను జగన్ ఒక్క జీవోతో రద్దు చేశాడు.

స్వర్గీయ వంగవీటి రంగా చావుకు కారకులైన వారి వారసుల్ని జగన్ అక్కున చేర్చుకున్నాడు. రంగాను దూషించి, అవమానించిన వారికి కీలక పదవులు కట్టబెట్టాడు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, సామదాన భేద దండోపాయాలు ప్రయోగించినా కాపు జాతిని లొంగదీసుకోలేడు. 

ఐప్యాక్, సొంతపార్టీ, ఇంటిలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకొనే జగన్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పెద్ద వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. తన చేతిలోని ప్రభుత్వ విభాగాలు, అధికార వ్యవస్థల్ని మీ పైకి, మీ సంస్థలపైకి ఉసిగొలుపుతానంటూ జగన్ వారిని బెదిరిస్తున్నాడు. తన పార్టీలో ఉండే ఆయా సామాజిక వర్గాలవారిని వదిలేసి, ఇతర పార్టీల్లోని వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడు. 

రాష్ట్రంలో నూటికి 70 శాతం మంది జగన్ పాలనను వ్యతిరేకిస్తుంటే, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు 99 శాతం వ్యతిరేకిస్తున్నారని జగన్ కు ఐప్యాక్, ఇంటిలిజెన్స్ నివేదికలు అందాయి. జగన్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఆ వర్గాలను బెదిరించి భయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూసినా చివరకు అతనికి మిగిలేది శూన్యమే" అని స్పష్టం చేశారు.


More Telugu News