కొవిడ్-19 సమయంలో జరిగిన అవినీతిపై ఆర్టీఐని వివరాలు కోరిన వ్యక్తి.. 48 వేల పేజీల జవాబిచ్చిన అధికారులు

  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • సకాలంలో సమాచారం ఇవ్వడంలో అధికారుల ఆలస్యం
  • ఉచితంగా ఇవ్వాలంటూ అప్పిలేట్ ఆదేశం
  • రాష్ట్ర ఖజానాకు రూ. 80 వేల నష్టం
  • సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అప్పిలేట్ ఆదేశం
కొవిడ్-19 సమయంలో జరిగిన అవినీతిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలు కోరిన ఓ వ్యక్తికి అధికారులు ఊహించని షాకిచ్చారు. ఏకంగా 48 వేల పేజీల సమాచారం ఇచ్చారు. దీంతో ఆ పేపర్లను మోసుకెళ్లేందుకు ఆయన తన కారును తీసుకెళ్లాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన.  

కరోనా సమయంలో సేకరించిన మందులు, ఇతర పరికరాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ ధర్మేంద్రశుక్లా అనే వ్యక్తి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్‌వో)ను సమాచార హక్కు చట్టం కింద కోరారు. ఆర్టీఐ చట్టం ప్రకారం ఆయన కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ధర్మేంద్ర కేసులో 32 రోజులు ఆలస్యమైంది. 

సమాచారం ఇవ్వడం ఆలస్యం కావడంతో ఆయన ఫస్ట్ అప్పిలేట్ అధికారి డాక్టర్ శరద్ గుప్తాను ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తం సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. సాధారణంగా పేజీకి రూ. 2 చెల్లించాల్సి ఉండగా సమాచారం ఇవ్వడంలో ఆలస్యమైనందుకు గాను అప్పిలేట్ ఆదేశాలతో రూపాయి కూడా చెల్లించకుండానే వారు అందించిన 48 వేల పేజీల సమాచారాన్ని ధర్మేంద్ర తీసుకున్నారు.

ఆ పేపర్లను తీసుకెళ్లేందుకు తన ఎస్‌యూవీని తీసుకెళ్లాల్సి వచ్చిందని ధర్మేంద్ర తెలిపారు. కారులో ఒక్క డ్రైవర్ సీటు తప్ప పేపర్లతో మొత్తం నిండిపోయిందన్నారు. కాగా, సకాలంలో సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ఖజానాకు రూ. 80వేల నష్టం తెచ్చిపెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీఎంహెచ్‌వోను గుప్తా ఆదేశించారు.


More Telugu News