గవర్నర్‌‌ అభ్యంతరాలపై వివరణ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

  • టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ సర్కారు
  • ఆర్టీసీ విలీన బిల్లుకు రూపకల్పన.. గవర్నర్‌‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు
  • పలు అంశాలపై వివరణ ఇవ్వాలన్న తమిళిసై
  • గవర్నర్ లేవెనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూపొందించిన బిల్లును గవర్నర్‌‌ ఆమోదం కోసం పంపగా.. రాజ్‌భవన్‌ వద్ద ఆగింది. ఆర్టీసీ బిల్లును పరిశీలిస్తున్నానని, పలు అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ కావాలని గవర్నర్‌‌ తమిళిసై కోరారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాజ్‌భవన్‌కు వివరణతో కూడిన కాపీని పంపింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని, సంస్థ ఇప్పటిలానే కొనసాగుతుందని చెప్పింది. కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఆర్టీసీ విలీన బిల్లు ప్రధాన ఉద్దేశమని వివరించింది.  

ఆర్టీసీ కార్మికులకు గత కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు అందుతాయని తెలిపింది. ప్రభుత్వంలో విలీనం తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని వివరించింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఏపీ తీరుగానే పరిష్కరిస్తామని గవర్నర్‌‌కు పంపిన వివరణలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 
అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని, బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.


More Telugu News