ఆర్టీసీ కార్మికులపై అంత ప్రేమ ఉంటే సమావేశాలు పొడిగించి బిల్లు పాస్ చేయించుకోవచ్చు: కిషన్ రెడ్డి

  • ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ న్యాయ సలహాలు తీసుకుని స్పందిస్తారన్న కిషన్‌రెడ్డి
  • తమిళిసై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం
  • కార్మికులపై ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్న
  • ఆర్టీసీ వేల కోట్ల ఆస్తులపై కన్నేశారని ఆరోపణ
తెలంగాణలో ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి నెలకొన్న వివాదంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ సలహాలు తీసుకుని గవర్నర్ స్పందిస్తారని చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే అసెంబ్లీ సమావేశాలు పొడిగించి బిల్లును పాస్ చేయించుకోవచ్చని సూచించారు. కార్మికులపై ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీకి సంబంధించిన వేల కోట్ల ఆస్తులపై బీఆర్ఎస్ నేతలు కన్నేశారని ఆరోపించారు. 

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు బీఆర్ఎస్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఉద్దేశంతో.. బిల్లును రూపొందించి గవర్నర్‌‌ ఆమోదం కోసం పంపింది. అయితే గవర్నర్ తమిళిసై ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని విషయాల్లో వివరణ ఇవ్వాలని నిన్న ప్రభుత్వాన్ని కోరారు. సీఎస్ వివరణ పంపగా.. మరిన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలంటూ మరోసారి కొన్ని ప్రశ్నలను గవర్నర్ అడిగారు. మరోవైపు గవర్నర్ తీరుకు నిరసనగా నిన్న ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ ముట్టడి చేపట్టారు. ఈ నేపథ్యంలో తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News