సెలెక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే: శిఖర్ ధావన్

  • ఆసియా క్రీడలకు టీమిండియా ఎంపిక
  • రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో యువకులకు పెద్దపీట
  • సీనియర్ ఆటగాడు ధావన్ కు మొండిచేయి
  • జట్టులోకి ఎంపిక కాకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్న ధావన్
టీమిండియా తరఫున టన్నుల కొద్దీ పరుగులు సాధించిన సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ది విచిత్రమైన పరిస్థితి. కొన్నాళ్ల కిందట పరిమిత ఓవర్ల క్రికెట్ లో పలు సిరీస్ లకు కెప్టెన్ గా జట్టును నడిపించిన ధావన్... ఇప్పుడసలు జట్టులోనే లేడు. 

చైనాలో జరిగే ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ కు భారత ద్వితీయశ్రేణి జట్టును ఎంపిక చేయగా, కనీసం అందులోనూ స్థానం దక్కలేదు. ఈ పరిణామాలపై ధావన్ స్పందించాడు. జట్టులో చోటు దక్కకపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపాడు. సెలెక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.

రిటైర్మెంట్ అంశంపై ఒక్క సెలెక్టర్ తోనూ మాట్లాడలేదని వెల్లడించాడు. అయితే, తన కెరీర్ ఇంతటితో ముగిసిందని తానేమీ భావించడంలేదని, టీమిండియాలోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. 

ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ వహిస్తుండడం సంతోషం కలిగించే అంశమని, యువకులతో నిండిన టీమిండియా ఆ టోర్నీలో రాణిస్తుందని ఆశిస్తున్నానని ధావన్ తెలిపాడు.


More Telugu News