ఢిల్లీలో జీ-20 సదస్సు నేపథ్యంలో... కోతులను తరిమేందుకు అధికారుల కొత్త ఎత్తుగడ

  • భారత్ కు ఈ ఏడాది జీ-20 అధ్యక్ష బాధ్యతలు
  • భారత్ లో సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ-20 సమావేశాలు
  • ఢిల్లీలో కోతుల బెడదపై దృష్టి సారించిన అధికారులు
  • కొండముచ్చుల్లా అరిచే సిబ్బందితో కోతుల ఆటకట్టించాలని నిర్ణయం
  • కొన్నిచోట్ల కొండముచ్చు బొమ్మల ఏర్పాటు 
భారత్ ఈ ఏడాది జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో జీ-20 ప్రధాన సదస్సు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశాల కోసం భారత కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అధికారులు కోతులపై దృష్టి సారించారు. 

జీ-20 సమావేశాలకు హాజరయ్యే అతిథులకు అసౌకర్యం కలిగించకుండా, కోతులను దూరంగా పారదోలాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కొండముచ్చుల్లా అరిచే నిపుణులైన ఉద్యోగులను రంగంలోకి దింపనున్నారు. కొండముచ్చులను చూస్తే కోతులు పారిపోతాయన్న సంగతి తెలిసిందే. అచ్చం కొండముచ్చులా అరిస్తే, నిజంగానే కొండముచ్చు అనుకుని కోతులు పరుగులు తీస్తాయన్నది అధికారుల ఆలోచన. 

ఢిల్లీలో కోతుల బెడద తీవ్రంగా ఉంటుంది. లుట్యెన్స్ ఢిల్లీ వంటి చారిత్రక ప్రదేశాల్లోనూ వీటి సంచారం అధికంగా ఉంటుంది. వానరాలను కట్టడి చేసేందుకు న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ), అటవీశాఖ సిబ్బంది చర్యలకు ఉపక్రమించారు. జీ-20 సమావేశాలు జరిగే వేదిక, విదేశీ అతిథులు బస చేసే హోటళ్ల వద్ద కోతుల వల్ల సమస్యలు రాకుండా చూస్తామని ఓ అధికారి తెలిపారు. 

ఎన్డీఎంసీ వైస్ చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్ దీనిపై స్పందించారు. కోతుల నియంత్రణ కోసం, ఏమాత్రం తేడా రాకుండా కొండముచ్చులా అరిచే ఉద్యోగులను ఎంపిక చేశామని చెప్పారు. నగరంలోకి కీలక ప్రాంతాల్లో 40 మంది వరకు ఇలాంటి ప్రత్యేక ఉద్యోగులను మోహరిస్తామని వివరించారు. 

కొండముచ్చులు ఉన్న చోటికి కోతులు రావన్నది అందరికీ తెలిసిన విషయమేనని ఉపాధ్యాయ్ అన్నారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో కొండముచ్చుల బొమ్మలను ఏర్పాటు చేస్తామని, వాటిని చూసి కోతులు వెనుదిరిగే అవకాశముంటుందని వెల్లడించారు.


More Telugu News