అధికార పార్టీ గూండాల నుంచి మాజీ సైనికుడికి ప్రాణహాని: పవన్ కల్యాణ్

  • మాజీ సైనికుడు ఆదినారాయణపై వైసీపీ సర్పంచ్ సంబంధీకులు దాడి చేశారని ఆరోపణ
  • సాధారణ దాడిగా కేసు నమోదు చేశారని పవన్ ఆగ్రహం
  • భూకబ్జాదారులు ఎంతకైనా తెగిస్తున్నారన్న జనసేనాని
దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన ఓ మాజీ సైనికుడు అధికార పార్టీ గూండాల నుండి ఇప్పుడు ప్రాణహానిని ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రైతులపాలెంకు చెందిన సైనికుడైన ఆదినారాయణపై స్థానిక వైసీపీ సర్పంచ్ సంబంధీకులు దాడి చేస్తే పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా సాధారణ దాడిగా కేసు నమోదు చేశారని విమర్శించారు.

సైనికుడిగా దేశ రక్షణ విధుల్లో భాగస్వామి అయిన ఈ సైనికుడు తన గ్రామంపై బాధ్యతతో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ప్రయత్నం చేస్తే అధికార పార్టీ హత్యాయత్నానికి తెగబడటం దురదృష్టకరం అన్నారు. వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములను, కాల్వలను కూడా కబ్జా చేస్తున్నారని ఆదినారాయణ... అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీ వారు ఆయనపై దాడికి పాల్పడ్డారన్నారు. భూకబ్జాదారులు ఎంతకైనా తెగిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతుంటే, వారి అనుచరులు కూడా అదే బాటలో పయనిస్తున్నారన్నారు.

ఆదినారాయణపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ సైనికుడికే రాష్ట్రంలో రక్షణ లేకుంటే సామాన్యుడి సంగతి ఏమిటి? అని ప్రశ్నించారు. గత ఏడాది తిరుపతిలో జనవాణి నిర్వహించిన సమయంలో ప్రసాద్ అనే సైనికుడు తన భూమిని వైసీపీ వాళ్లు కబ్జా చేసి వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడని గుర్తు చేశారు.


More Telugu News