ఈ తోక చుక్క మళ్లీ 400 ఏళ్లకు కానీ కనిపించదు..!

  • ఈ నెల 12న దర్శనమివ్వనున్న నిషిమురా తోకచుక్క
  • సూర్యోదయానికి  పూర్వం ఈశాన్య దిక్కున దర్శనం
  • మంచి బైనాక్యులర్ సాయంతో చూడొచ్చంటున్న శాస్త్రవేత్తలు
సౌర వ్యవస్థలో ఓ అరుదైన తోక చుక్క ఈ నెల 12న కనిపించనుంది. దీని పేరు నిషిమురా. జపాన్ శాస్త్రవేత్త హిడియో నిషిమురా దీన్ని ఈ ఏడాదే ఆగస్ట్ 12న తొలిసారి కనిపెట్టారు. ఇది కిలోమీటర్ పరిమాణంలో ఉంటుంది. భూమికి 80 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి ఈ నెల 12న ఇది వెళ్లనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారికి ఇది స్పష్టంగా కనిపించనుంది. ఇప్పుడు దీన్ని చూడలేని వారికి మరో అవకాశం ఉండదు. ఎందుకంటే 400 ఏళ్ల తర్వాతే మళ్లీ ఇది భూమికి సమీపంగా వస్తుంది. 

నేరుగా కంటితో కాకుండా ఏదైనా పరికరం సాయంతో దీన్ని స్పష్టంగా చూడొచ్చు. ఆకాశంలో ఇది ఉన్న స్థానం దృష్టా నేరుగా కంటితో చూస్తే అస్పష్టంగా అనిపిస్తుంది. తెల్లవారుజాము సమయంలో, సూర్యోదయానికి అరగంట ముందు ఈశాన్య దిక్కున నింగివైపు చూస్తే ఈ తోక చుక్క కనిపిస్తుంది. సూర్యుడికి చేరువ అయ్యే కొద్దీ ఇది మరింత ప్రకాశవంతంగా మారుతుంది. కానీ, భూమి పైనున్న వారికి కనిపించదు. మంచి బైనాక్యులర్ సాయంతో కచ్చితమైన దిశలో చూస్తే ఇది కనిపిస్తుందని నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ మేనేజర్ పౌల్ చోడాస్ సూచించారు. సెప్టెంబర్ 17న సూర్యుడికి ఇది చేరువగా వెళుతుంది.


More Telugu News