చంద్రబాబు అరెస్టు ఫొటోలు, వీడియోలు చూస్తూ జగన్ ఆనందం పొందాడు: ఆనం రామనారాయణ రెడ్డి

  • టీడీపీ అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా నెల్లూరులో ఆనం ఆందోళన
  • ఫొటోలు, వీడియోలు పంపే బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారని వెల్లడి 
  • రఘురామ కృష్ణరాజు విషయంలోనూ ఇలాగే జరిగిందన్న వైసీపీ మాజీ నేత
  • చంద్రబాబు మచ్చలేని నాయకుడని ప్రశంస.. 
  • రాష్ట్రాభివృద్ధి కోసం జాతీయ రాజకీయాలు వదులుకున్నారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సైకోలా వ్యవహరిస్తున్నాడని, చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూస్తూ ఆనందించాడని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నెల్లూరులో తన అనుచరులతో కలిసి రామనారాయణ రెడ్డి నిరసన ప్రదర్శన చేపట్టారు. 

ఈ ఆందోళనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లండన్ వెళుతూ చంద్రబాబు అరెస్టు చేసే దృశ్యాలను ఎప్పటికప్పుడు తనకు ఫోన్ లో పంపించే బాధ్యతను తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి ఎప్పటికప్పుడు పంపిన వీడియోలను జగన్ లండన్ లో కూర్చుని చూస్తూ ఆనందించాడని మండిపడ్డారు. గతంలో రఘురామ కృష్ణరాజు విషయంలోనూ ఇలాగే జరిగిందని ఆనం గుర్తుచేశారు.

ఈ విషయంలో జగన్ తమను పట్టించుకోకపోయినా, దూరంపెట్టినా కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తరఫున వాదిస్తున్న లాయర్లు సజ్జల, విజయసాయి రెడ్డిల ఫోన్ కాల్స్ వివరాలను అడిగే అవకాశం ఉందని, అలా జరిగితే దొరికిపోతామనే ముందుచూపుతో జగన్ ఈ బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారని రామనారాయణ రెడ్డి చెప్పారు.
 
మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలని న్యాయ నిపుణులు, మాజీ ఉన్నతాధికారులు చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని వివరించారు. ఐదు రోజులుగా విశాఖలోనే ఉన్నప్పటికీ తనకు ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గవర్నర్ చెప్పారన్నారు.

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు నిజాయతీపరుడని ఆనం స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ పొందిన 87 వేల మంది విద్యార్థులు ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో ఉన్నారని మీడియా చూపిస్తోందన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలోని పలు కాలేజీల్లో కొనసాగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాలను మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, రాష్ట్రంలో పైశాచిక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. 

జాతీయ స్థాయిలో పేరున్నా.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నా.. అవన్నీ వదులుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తన వ్యక్తిగత అభివృద్ధిని కూడా వదులుకున్న మచ్చలేని నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. జాతీయ స్థాయి నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.


More Telugu News