సనాతన ధర్మంపై స్పందించిన పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం
  • యుద్ధం వద్దు అని చాలా రాయబారాలు నడిపానన్న పవన్
  • నీకు యుద్ధమే కావాలనుకుంటే ఇక కురుక్షేత్రమేనని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు
మంగళగిరిలో ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపైనా స్పందించారు. సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ వెళుతుందని అన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు యాస మారుతుందని, అయినా సరే కలిసే ఉంటామని, అదే మన దేశ గొప్పదనం అని అభివర్ణించారు. ద్వేషంతో ఉన్న మనుషుల ఆలోచనలు కాలగర్భంలో కలిసిపోతాయని తెలిపారు. 

సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇంకో మతానికి వ్యతిరేకం కాదని పవన్ స్పష్టం చేశారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుంటుందని అన్నారు. సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటుందని వివరించారు.

యుద్ధం వద్దు అని శ్రీకృష్ణుడిలా చాలా రాయబారాలు నడిపాను... నీకు యుద్ధమే కావాలనుకుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని ఇస్తాను... సిద్ధంగా ఉండు అని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

2014లో ప్రాణాలకు తెగించి పార్టీ పెట్టానని, ఆ రోజున తనవెంట ఉన్నది 150 మంది మాత్రమేనని తెలిపారు. నా ప్రశాంతతను చేతగానితనంగా భావించవద్దు... అది బాధ్యత అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో కొందరు అధికారులు రాజ్యాంగ అతిక్రమణలకు పాల్పడుతున్నారని, కులానికి, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అధికారులకు సిగ్గుండాలి అని విమర్శించారు. 

నాడు 389 మంది ప్రతినిధులు రాజ్యాంగాన్ని రూపొందించారు... ఇవాళ  జగన్ వచ్చి అంతా నేనే అంటే చూస్తూ ఊరుకుంటామా? అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


More Telugu News