రాజమండ్రి సెంట్రల్ జైల్లో తోపులాట.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

  • గత నెల 15న ఖైదీలు భోజనానికి వస్తున్న సమయంలో తొక్కిసలాట
  • నవీన్ రెడ్డి అనే ఖైదీ దవడకు తీవ్ర గాయాలు
  • నిన్న కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కు తీసుకొచ్చిన వైనం
రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న భోజనానికి వెళ్లే సమయంలో ఖైదీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సెల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ తోపులాటలో అక్కడున్న సిమెంట్ దిమ్మపై నవీన్ రెడ్డి అనే ఖైదీ గాయపడ్డాడు. ఆయన దవడ ఎముకకు తీవ్ర గాయమయింది. అతన్ని నిన్న కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో జైల్లో జరిగిన తోపులాట గురించి నవీన్ బయటకు వెల్లడించాడు. అయితే, ఈ ఘటన చోటు చేసుకుని 15 రోజులు కావస్తున్నా జైలు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. 

ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందిస్తూ... ఖైదీలంతా ఒక్కసారిగా భోజనానికి వస్తున్న సమయంలో నవీన్ రెడ్డి కంగారుగా కాలు జారి పక్కనున్న మెట్టుపై జారిపడ్డాడని తెలిపారు. దీంతో అతని ఎడమ దవడకు గాయమయిందని చెప్పారు. మరుసటి రోజే చికిత్స కోసం అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని... అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కాకినాడ జీజీహెచ్ కు తీసుకెళ్లామని తెలిపారు. అక్కడ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్లు సెలవులో ఉన్నారని చెప్పారు. దీంతో, రెండుసార్లు నవీన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినా పని జరగలేదని... ముడోసారి తీసుకెళ్లగా చికిత్స చేస్తున్నారని తెలిపారు.

కాగా, ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు  భద్రతపై  ఆయన  కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం  తెలిసిందే.


More Telugu News